కరోనా పట్ల జాగ్రత్త వహించాలి : కిమ్స్ ఐకాన్ వైద్యులు
- 200 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు
- ఉచితంగా మందులు పంపిణీ
కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు కిమ్స్ ఐకాన్ వైద్యులు. ఆదివారం చోడవరం మండలం నర్సయ్యపేట గ్రామంలో కిమ్స్ ఐకాన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని దాదాపు 200 మందికి పైగా ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైజాగ్ పట్టణానికి చెందిన కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ నుండి ప్రముఖ కార్డియాలజిస్ట్ వాసుబాబు దేవల, జనరల్ మెడిసిన్ డాక్టర్ గణేష్‌లు వారికి ఉచితంగా 2డి ఏకో, ఈసీజీ, బిపి, షుగర్ టెస్ట్‌లు చేశారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ వాసుబాబు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి మళ్లీ మొదలైందన్నారు. నర్సయ్యపట్నం గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ వైద్య శిబిరం నిర్వహించామన్నారు. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. కరోనా కాకుండా ఇతర వ్యాధులు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, హుమన్‌రైట్‌స్ అసోసియేషన్ సభ్యులు, కిమ్స్ ఐకాన్ సిబ్బంది పాల్గొన్నారు.