ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్‌లో క్లిష్ట‌మైన స‌ర్జ‌రీ విజ‌య‌వంతం

SLG HOSPITAL

నగరంలోనే వైద్యసేవలందించే ప్రముఖ ఆసుపత్రులలో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆసుపత్రుల వైద్యులు, పుట్టుకతోనే (బ్రాంకియల్ ఫిస్టులా) ఒక అరుదైన లోపంతో బాధపడుతున్న ఒక యువతికి విజయవంతంగా వైద్యం చేశారు. దాదాపు తొమ్మిదేళ్లపాటు ఇది బయట పడలేదు. గత పదేళ్లలో రోగికి కనీసం 18 సార్లు పలుచోట్ల విఫల సర్జరీలు జరిగాయి.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి చెందిన పదహారు సంవత్సరాల వయసు గల రోగి, మెడ భాగంలో బాగా వాపు, చీము కారడంతో ఎస్ఎల్‌జీ ఆసుపత్రి వైద్యుల దగ్గరకి వచ్చారు. ఇది దాదాపు తొమ్మిదేళ్ల క్రితం మొదలైంది. అప్పటి నుంచి కనీసం యేడాదికి రెండు సార్లు చిన్న పెద్ద సర్జరీలు జరిగాయి. ప్రతిసారి చీము తీసేయడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది. కానీ, కొన్ని నెలల తరువాత మళ్లీ ఇలానే జరిగేది. ఆహారం మింగడంలో కూడా ఇబ్బంది ఎదురయ్యేది.

దీని గురించి మాట్లాడుతూ, ఎస్ఎల్‌జీ ఆసుపత్రులలో, తల మెడ క్యాన్సర్ కన్సల్టెంట్, రీకన్స్ట్రక్టివ్ & లేజర్ సర్జన్ అయిన డాక్టర్ భార్గవ్ ఇలపకుర్తి ఇలా అన్నారు, “ఈ రోగికి అరుదైన లోపం ఉంది. కాంట్రాస్ట్ సీటీ, ఇతర పరీక్షలు జరిపాక, అసలు ఇబ్బంది ఏంటో కనుక్కోగలిగాము. గుండె నుంచి మెదడుకి వెళ్ళే ముఖ్యమైన రక్తనాళాల మధ్య ఉండే చర్మం, అన్నవాహికల మధ్య ఒక అసాధారణమైన కనెక్షన్ ఏర్పడింది. ఇది థైరాయిడ్ గ్రంధికి దగ్గరగా ఉండి సుపీరియర్ లారింజియల్ నర్వ్‌కి కూడా తగలడంతో ప్రాణహాని ఉంది!”

“ఇతర అవయవాలకి ఏమీ అవ్వకుండా పూర్తిగా ఆ ట్రాక్ట్‌ని తొలగించాము. సర్జరీ జరిగే సమయంలో, జరిగాక కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఒక మల్టీ-డిసిప్లినరీ విధానంలో చాలా క్లిష్టమైన సర్జరీ చేయవలసి వచ్చింది. సర్జరీ నవంబర్ 27న చేశాము. రోగి సర్జరీ జరిగిన రోజునుంచే ఆహారం తీసుకోవడం మొదలుపెట్టారు. సర్జరీ జరిగిన మూడో రోజు డిస్చార్జ్ అయ్యారు,” అని డాక్టర్ భార్గవ్ ఇలపకుర్తి అన్నారు.

ఈ లోపం వల్ల రోగి మానసికంగా ఇబ్బంది పడడమే కాకుండా, ఎన్నో యేళ్ల నుంచి బడికి వెళ్లడానికి కూడా వీలుపడలేదు. ఇప్పుడు తను సాధారణంగానే తినగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. బడికి కూడా వెళ్లడం మొదలుపెట్టారు. ఇది మళ్లీ జరుగుతుందనే భయం లేకుండా సాధారణ జీవితాన్ని చూడగలరు. డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీకాంత్ సోమ ఇతర స్టాఫ్ సభ్యుల సహకారంతో ఇది విజయవంతంగా చేయగలిగారు.