కేసీఆర్ అవినీతి అమిత్‌షా చేతిలో

AMITSHA BJP

తెలంగాణ‌లో మ‌రోమారు అధికారంలోకి రావ‌డానికి కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నార‌ని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఓట్ల కోసం వ‌డ్ల రాజ‌కీయం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విష‌యంలో కేసీఆర్ డ్రామాను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని రాష్ట్ర నాయ‌కుల‌కు సూచించారు. పార్లమెంటు భవనంలోని అమిత్‌షా చాంబర్‌లో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీలు అర్వింద్‌, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, ఎం. రఘునందన్‌రావు, సీనియర్‌ నేతలు గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి, వివేక్‌, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు అరగంటకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి అమిత్‌ షాకు వారు వివరించారు.

‘‘సీఎం కేసీఆర్‌ అవినీతికి సంబంధించిన అంశం నా నోటీసులో ఉంది. టీఆర్‌ఎ్‌సపై పోరాటం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎక్కడా వెనక్కి తగ్గొద్దు. ప్రజలతో పాటు మీ దృష్టిని కూడా మళ్లించేందుకు ఆయన (కేసీఆర్‌) ప్రయత్నిస్తారు. ఆయన ట్రాప్‌లో పడవద్దు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించండి. ధాన్యం కొనుగోలులో కుంభకోణాన్ని ఎండగట్టండి. ఈ విషయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి’’ అని మంత్రి అమిత్‌ షా.. రాష్ట్ర బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతలను ఉరికించాలని, ఊళ్లలోకి రానీయవద్దంటూ టీఆర్‌ఎస్‌ శ్రేణులకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.