జిట్టా ప‌య‌నం చేతికి తోడా… క‌మ‌లాని నీడ‌నా ?

తెలంగాణ రాజ‌కీయాల్లో జిట్టా బాల‌కృష్ణారెడ్డి పేరు తెలియ‌ని వారు ఉండరు. ఉద్య‌మం ప‌థాక‌స్థాయిలో న‌డుస్తున్న త‌రుణంలో కేసీఆర్ అత‌నికి ఇచ్చిన ప్రాధాన్య‌త అలాంటింది. ఆ త‌రువాత చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో అదే స్థాయిలో పార్టీ నుండి వైదొలిగారు. ఆ త‌రువాత యువ తెలంగాణ పార్టీ స్థాపించి రాజ‌కీయ అడుగులు వేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా.. ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు అత్యంత సన్నిహితునిగా మెలిగిన జిట్టా బాలకృష్ణారెడ్డి .. తెరమీద లేకుండా అయ్యారు. జరిగిన అన్యాయానికి టీఆర్ఎస్ నుంచి బయటపడి కాంగ్రెస్ మీదుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ లోకి పయనించి.. చివరకు సొంత పార్టీ యువ తెలంగాణ పార్టీలో స్థిరపడిన జిట్టా.. అడుగులు ఎటు వైపు పడుతున్నాయి..? ఆయన రాజకీయ పయనం ఎటు వైపు..? కాంగ్రెస్.. బీజేపీ ల్లో చేరతారంటూ జరుగుతున్న ప్రచారం మాటేమిటి..!?

జిట్టా … వేరు రాజకీయం !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరపరితమైన పేరు జిట్టా బాలకృష్ణారెడ్డి. యువజన‌ సంఘాల సారథిగా ఆయనకు విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. తెలగాణ రాష్ట్రసమితి రాష్ట్ర యువజన విభాగం నాయకునిగా.. తెలంగాణ పల్లెల్లో.. యువతతో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. భువనగిరి కేంద్రంగా నిర్వహించిన కార్యక్రమాలు.. టీఆర్ఎస్ లో.. ఆ పార్టీ అధినేత మనసులో ఆయనకు ప్రత్యేక స్థానం ఉండింది. అయినా.. ఆయనిప్పుడు ఆ పార్టీలో లేరు.. నిత్యం ఆ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై కాలు దువ్వుతూనే ఉన్నారు. నిజంగానే.. జిట్టా బాలకృష్ణారెడ్డి పేరును విస్మరించి తెలంగాణ స్వరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం గురించి మాట్లాడుకోలేం. జిట్టా బాలకృష్ణారెడ్డి ఇపుడు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి… టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరాక కూడా.. ఉద్యమకారుల ఆకాంక్షల కోసం కొట్లాడుతున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం, బొమ్మాయిపల్లి గ్రామంలో జన్మించిన జిట్టా.. జిల్లా ప్రజల ఉద్యమ గొంతుకయ్యారు. జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి బలోపేతానికి జిట్టా ఎంతో కృషి చేశారు. ఆర్థికంగా, నైతికంగా కార్యకర్తలకు, ఉద్యమకారులకు అండగా నిలబడ్డారు. 2009తో భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా టికెట్ దక్కలేదు. దీంతో జిట్టా ఇండిపెండెంట్ గా బరిలోనిలిచారు. ఇక్కడి నుంచే ఆయన వేరు రాజకీయం మొదలైంది.

నిత్య… పోరాటం !

జిట్టా బాలకృష్ణారెడ్డి టీఆర్ఎస్ నుంచి భువనగిరి టికెట్ ఆశించారు. కానీ, ఆ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో.. రెండో సారి ఎన్నికలకు వెళుతున్న కాంగ్రెస్ ను మట్టికరిపించాలని రాష్ట్రంలోని పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చిన సందర్భంలో.. టీఆర్ఎస్ టీడీపీతో అంటకాగింది. ఫలితంగా.. అప్పటికే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ.. ఎలిమినేటి ఉమా మాధవరెడ్డిని పక్కన పెట్టలేక పోయింది. దీంతో జిట్టాకు అవకాశం దక్కలేదు. పొత్తులో భాగంగా.. టీడీపీ బరిలోకి దిగితే.. టీఆర్ఎస్ రెబల్ గా (ఇండిపెండెంట్…గా ) పోటీకి దిగిన జిట్టా బాలకృష్ణా రెడ్డి గణనీయమైన ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మారారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించాక.. ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేకి అంటూ బయటకు వచ్చేశారు. తొలుత తెలంగాణ ఉద్యమ కారుల జేఏసీ.. అనతరం యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. టికెట్ తప్పి పోయిన 2009 సంవత్సరం నుంచి ఇప్పటి దాకా నిత్య పోరాటం చేస్తూనే ఉన్నారు.

ఆ అడుగులు ఎటు వైపు..?

కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో.. మీడియాలో.. జిట్టా బాలకృష్ణారెడ్డి రాజకీయ పయనం ఎటువైపు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆయన ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారు అన్న చర్చపైనా రక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2009లో టీఆర్ఎస్ టికెట్ తప్పిపోయాక.. జరిగిన 2014 ఎన్నికల్లో ఆయన.. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని.. కోమటిరెడ్డి సోదరులు ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. మిర్యాలగూడెం టికెట్ నాడు దాదాపుగా.. ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ కు ఖరారు కాగా.. రాత్రికి రాత్రి చక్రం తిప్పిన జిల్లా కాంగ్రెస్ లోని సీనియర్లను ఆ స్థానాన్ని ఎన్.భాస్కర్ రావుకు ఇప్పించారు. దీని ప్రభావం భువనగిరిపై పడి.. ఆ స్థానాన్ని అనివార్యంగా బీసీలకు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కోమటిరెడ్డి అనుచరునిగా ఉన్న వెంకటేశ్వర్లను టికెట్ వరించగా.. జిట్టాకు తప్పి పోయింది. 2014 ఎన్నికల్లోనూ.. అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కమార్ రెడ్డి దగ్గరి నాయకునిగా పేరున్న అనిల్ కమార్ రెడ్డి టికెట్ ఎగరేసుపోగా.. జిట్టా .. సొంతంగానే పోటీ చేయాల్సి వచ్చింది. వరసగా.. మూడు సార్లు పోటీ చేసిన జిట్టా భువనగిరి నియోజకవర్గంలో తన పట్టును నిరూపించుకోగలిగారు. ఈ కారణంగానే… ఇపుడు అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ ఆయనను పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎన్.రేవంత్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు.. తమ తమ పార్టీలను తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా సిద్ధం చేయాలన్న కార్యాచరణలో ఉన్నారు. దీనిలో భాగంగా.. నియోజకవర్గాల వారీగా.. బలమైన నాయకుల కోసం చూస్తున్నారు.

పార్లమెంటుకు పోటీపై … జిట్టా ఆసక్తి !

ఏ పార్టీకి .. ఆ పార్టీ … జిట్టా బాలకృష్ణారెడ్డి తమ పార్టీలోనే చేరుతున్నారంటూ.. సోషల్ మీడియా పోస్టింగులతో ఊదరగొడుతున్నాయి.. ఈ క్రమంలో.. అసలు జిట్టా ఏం అనుకుంటున్నారు..? ఆయన రాజకీయ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి..? జిట్టా సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారం మేరకు… ఈ సారి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఉద్దేశంలో జిట్టా ఉన్నారని.. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికైతే.. కాంగ్రెస్ చేరాలని కానీ.. లేదా, బీజేపీలో చేరాలని కానీ నిర్ణయించుకోలేదని అంటున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉన్న నేపథ్యంలో.. కొద్ది రోజులు వేచి చూసే ధోరణితో ఉన్నారని పేర్కొంటున్నారు. రాష్ట్రం రాజకీయ పరిణామాలను పరిశీలించి.. పరిస్థిని బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకునే వీలుంది. అయితే.. ఆ అడుగులు కాంగ్రెస్ వైపా..? లేక బీజేపీ వైపా..? అన్నది తేలడానికి కొద్ది రోజులు ఎదురు చూడాల్సి ఉంటుందని ఆయన సన్నిహితులు అన్నారు.