గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం
గచ్చిబౌలిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదానికి గురైన కారు(TS 07 UH 1349)పై 15 ఈ-చలాన్లు ఉన్నాయి. 15లో 12 ఓవర్ స్పీడ్‌కు సంబంధించిన చలాన్లే. మిగతా రెండింటిలో ఒకటేమో రాంగ్ పార్కింగ్, మరొకటేమో సిగ్నల్ జంప్‌కు సంబంధించిన చలాన్లు. స్పీడ్ లిమిట్ 100 ఉన్న రహదారులపై ఈ కారు 120 కిలోమీటర్లకు పైగా స్పీడ్‌తో దూసుకెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 13వ తేదీన సైబరాబాద్ పరిధిలో స్పీడ్ లిమిట్ 40 ఉన్న రోడ్డులో 75 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈ కారుపై రూ. 14,625 జరిమానా ఉంది. ఈ వాహనంపై సైబరాబాద్, హైదరబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే అధికంగా ఓవర్ స్పీడ్ చలాన్లు నమోదు అయ్యాయి.
మద్యం మత్తు, ఓవర్ స్పీడే కారణమా?
గచ్చిబౌలి పరిధిలో జరిగిన ఈ ప్రమాదానికి మద్యం మత్తుతో పాటు ఓవర్ స్పీడే కారణమని తెలుస్తోంది. కారు వేగంగా దూసుకెళ్తున్న క్రమంలో అదుపుతప్పి హెచ్‌సీయూ వద్ద చెట్టును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.
గచ్చిబౌలిలో నివాసముంటున్న సాయి సిద్దూ(24) ఇంట్లో అబ్దుల్ రహీం(25), ఎం మానస(21), ఎన్ మానస(23) శుక్రవారం రాత్రి మద్యం సేవించినట్లు సమాచారం. అనంతరం ఓ యాప్ ద్వారా కారును అద్దెకు తీసుకుని గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అబ్దుల్ రహీం మాదాపూర్ యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగి కాగా, మిగతా ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు. అబ్దుల్ రహీం స్వస్థలం విజయవాడ కాగా, ఎం మానస(జడ్చర్ల, బాదేపల్లి), ఎన్ మానస కర్ణాటకకు చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.