హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న ఒమిక్రాన్
హైదరాబాద్‌లో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ సోకిన ఇద్దరూ సిటీలోని టోలీచౌకీలో ఉన్న పారా మౌంట్ కాలనీ వాసులు కావడంతో ఆ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. 40 మంది వైద్య సిబ్బందితో ఆ ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి టెస్టులు చేశారు. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారు ఉంటున్న అపార్ట్‌మెంట్లలో శాంపిల్స్ తీసుకున్నారు. ఇప్పటి వరకు 136 మందికి పరీక్షలు చేశామన్నారు వైద్యాధికారులు. రేపు ఉదయం వరకు అందరి రిపోర్టులు వస్తాయంటున్నారు.
కాగా, రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకడంతో అలర్ట్ అయింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ. ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలతో పాటు షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, హస్పిటల్స్ లో కూడా కరోనా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్ లేకుంటే ఫైన్ వేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇక ప్రతీ షాపు, ఆఫీసు బయట.. మాస్క్ మస్ట్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నవారికే అనుమతి అంటూ కొందరు యజమానులు రూల్స్ పెట్టారు. కొన్ని సంస్ధలు అయితే తమ సిబ్బందికి వ్యాక్సిన్ వేపిస్తున్నాయి. కొన్ని చోట్ల డబుల్ మాస్కులు వేసుకోవాలని సూచిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు సానిటైజ్ చేసుకుంటేనే లోపలికి అనుమతిస్తున్నారు.