నేడే ఎమ్మెల్సీ ఫలితాలు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలబడనున్నాయి. కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా మరి కొన్ని స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్క ప్రక్రియ ప్రారంభం కానుదంని, మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు విడుదల వస్తాయని ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు.
కౌంటింగ్ కోసం ఆదిలాబాద్‌లో 6, నల్లగొండలో 5, మెదక్‌లో 5, ఖమ్మంలో 5, కరీంనగర్‌లో 9 టేబుళ్లు ఏర్పాటు చేశారు. తొలుత బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున కట్టలుగా కట్టి ఆ తర్వాత లెక్కించనున్నారు. ముందు తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. నల్లగొండ, మెదక్‌లో రౌండ్లు ఎక్కువ ఉంటాయని సీఈఓ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు 10 మంది, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక స్థానానికి ఏడుగురు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు, ఖమ్మంలో నలుగురు, మెదక్‌లో ముగ్గురు బరిలో నిలిచారు. కాగా మూడు స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఎదురైంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాల్లో క్రాస్‌ఓటింగ్ VS జరిగినట్టు చర్చ జరుగుతోంది.