మొద‌లైన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌

తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆరు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఉద‌యం 8గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఐదు జిల్లాలు.. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం లో ఒక్కో స్థానానికి, కరీంనగర్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

2,329 మంది పురుష ఓటర్లు, 2,997 మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉండగా, తొలిసారిగా.. ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు హక్కు కల్పించారు. ఓటర్లలో ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లే సుమారు మూడొంతుల మందికి పైగా ఉండటంతో అభ్యర్థుల గెలుపోటముల్లో వీరి పాత్ర కీలకం కానుంది.

ఇందులో టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు ఎక్కువ మంది ఉండటంతో ఎన్నికలు జరిగే ఆరు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్, ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థులు, ఇతర చోట్ల స్వతంత్రుల నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీ ఎదుర్కొంటున్నారు. అందరు కోవిడ్‌ నిబంధనలను పాటించాలని సీఈఓ శశాంక్‌ గోయల్‌ కోరారు.