మెద‌క్ క‌లెక్ట‌ర్ తెరాస ప్ర‌భుత్వానికి క్ల‌ర్క్ – ఈట‌ల జ‌మున‌

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ భార్య ఈట‌ల జ‌మున మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్‌కి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. జిల్లాలోని అచ్చంపేట‌, హాకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూముల విష‌యంలో క‌లెక్ట‌ర్ అధికార పార్టీకి అండగా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. జమున హేచరీస్‌కు సంబంధించిన భూములను ఈటల రాజేందర్‌ బలవంతంగా ఆక్రమించుకున్నారంటూ కలెక్టర్‌ హరీశ్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
‘‘జమున హేచరీస్‌ భూములపై కలెక్టర్‌ హరీశ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టారు. ఈ విషయంలో విలేకరుల సమావేశం పెట్టడానికి ఆయనకు ఏం అధికారం ఉంది? ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాం. వాళ్లు వచ్చి మళ్లీ సర్వే చేశారు. వాటికి సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాలి. ‘మీ భూమి ఇదే. ఇంతే ఉంది’ అని కనీసం మాకు ఒక కాపీ ఇవ్వాలి. మాకు ఎలాంటి వివరాలు చెప్పలేదు. ఈ రోజు నేరుగా విలేకరుల సమావేశం పెట్టి, భూములు ఆక్రమించుకున్నారంటూ కలెక్టర్‌ ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌ ఏమైనా రాజకీయ నాయకుడా? తెరాస ప్రభుత్వానికి క్లర్క్‌గా పనిచేస్తున్నారా? ఈ విషయమై ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఎలాంటి సమస్యలు లేని భూములే ధరణిలోకి ఎక్కుతాయని గతంలో సీఎం కేసీఆర్‌ చెప్పారు. 2019లో అలాంటి భూములనే మేము కొనుగోలు చేశాం. మొత్తంగా మాకున్నదే 8.36 ఎకరాలు. కలెక్టర్‌ చెప్పిన 70 ఎకరాలతో మాకు సంబంధం లేదు. ఆక్రమణకు సంబంధించిన ఆరోపణలు ఉంటే ఈ రెండేళ్లు ఏం చేశారు? ఇది కచ్చితంగా వ్యక్తిగత కక్ష సాధింపు చర్యల కిందకే వస్తుంది. రాజకీయంగా ప్రత్యర్థి అయితే, అలాగే ఎదుర్కొవాలి. ఈటల రాజేందర్‌ 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ అధికారికైనా ఫోన్లు చేశారా? అధికారులకు ఫోన్లు చేసి భూములు ఆక్రమించుకున్నారా? గతంలో లేనిది ఇప్పుడే ఆక్రమించుకున్నారని ఎందుకు చెబుతున్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే ఈ ప్రభుత్వం ఒక మహిళా వ్యాపారవేత్త మీద దాడి చేయటం సరైన పద్ధతి కాదు’’ అని జమున మండిపడ్డారు.