బొమ్మ ప‌డుతుంది అంతే

క‌రోనా నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినిమా రంగంపై నీలి నీడలు క‌మ్ముకుంటున్నాయి. సినిమా రంగంపై వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తెలిపారు. క‌రోనా వ‌ల్ల మూత‌ప‌డ్డ సినిమా థియేట‌ర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకొని ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నాయి.
ఇంత‌లోనే క‌రోనా మ‌ళ్లీ విజృంభించ‌డం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌జ‌ల్ని భ‌య‌పెట్టిస్తున్నాయి. వీటి వ‌ల్ల మ‌ళ్లీ లౌక్‌డౌన్ విధించ‌డం, సినిమా థియేట‌ర్లు, మాల్స్ మూత‌ప‌డుతాయ‌ని త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే పెద్ద సినిమాల‌ను సంక్రాంతి పండ‌గ‌క్కి విడుద‌ల చేయాల‌ని సిద్దం చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ఈ వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. అయితే సినిమారంగం పెద్ద‌ల‌తో మంత్రి త‌ల‌సాని స‌మావేశ‌మై చ‌ర్చించారు. ప్ర‌జ‌లు ఎలాంటి భ‌యాందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని సినిమా థియేట‌ర్ల‌కు వెళ్లి చూడ‌వ‌చ్చ‌ని హామీ ఇచ్చారు.
అయితే క‌రోనా, ఒమిక్రాన్ ఎలాంటి ప్ర‌భావం చూపుతాయో వేచి చూడాలి మ‌రీ.