పంచారామాలు – విశిష్ఠతలు – పార్ట్ 1

ర‌చయిత్రి – మీనాక్షి

శైవ క్షేత్రాలలో ప్రసిద్దమైనవి ఎంతో మహిమాన్వితమైన సుప్రసిద్ధ ఆరామాలు గా విరాజిల్లుతున్న పంచారామాలు గురించి తెలుసుకుందాం.
సృష్ఠి స్థితి లయ కారకుడు శివుడు …శివ అనే పదానికి శుభం అని అర్థం లింగం అంటే సంకేతం అని అర్థం ఈ ప్రకారం చూస్తే శివలింగం అంటే శుభప్రదమైన దైవం అని అర్థం.
శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం ప్రకారం ఈ పంచారమాల ఉద్భవం వెనుక ఒక విశేష కథ ప్రాచుర్యం లో ఉంది
క్షీరసాగర మధనం లో ఉద్భవించిన అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహినీ రూపం ధరించి దేవతలకు, రాక్షసులకు సరి సమానంగా పంచడం ప్రారంభిస్తాడు అయితే త్రిపురాసురుడు అనే రాక్షసుడు మాత్రం అమృతం తమ వర్గానికి సమానం గా దక్కలేదని అసంతృప్తి తో శివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు భోళాశంకరుడు వారి తపస్సును మెచ్చుకొని వారికి వివిధ శక్తులను వారాలుగా ఇస్తాడు ఆ శక్తులతో రాక్షసులు దేవతలను అనేక ఇబ్బందులు పెడుతూ వారితో యుద్దానికి తలపడతారు దీనితో దేవతలు మహాశివుని వద్దకు వెళ్లి తమను రాక్షసుల భారీ నుండి తప్పించమని ప్రార్థించగా దేవతల మొర ఆలకించిన పరమేశ్వరుడు త్రిపురాంతకుడి రూపం లో ఆ రాక్షసులను వారి రాజ్యాలను బూడిద చేస్తాడు ఆ యుద్ధం లో త్రిపురాసురులు పూజించిన అతి పెద్ద మహా శివలింగం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది . ఈ శివలింగాన్ని దేవతలు భూమిపై అయిదు ప్రదేశాలలో ప్రతిష్ఠ చేసారని అవే తెలుగునాట పంచారామాలు వెలసి ప్రసిద్ధ శైవ క్షేత్రాలు గా విరాజిల్లుతున్నాయి.

మొదటిది . ద్రాక్షారామం
శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి

శివ కేశవులు తో పాటు ఎంతో మహిమాన్వితమైన శక్తి పీఠం కూడా కొలువైన దివ్య ధామం ద్రాక్షారామం దక్షుడు అనే రాజు పరిపాలించిన రాజ్యం గాను యజ్ఞ క్రతువులు చేసిన ప్రదేశం కాబట్టి ఇది ద్రాక్షారామం గా పేరుగాంచింది అని పెద్దల వచనం ఈ క్షేత్రం లో కొలువు తీరిన ముక్కంటిని శ్రీ రామచంద్రుడు , దేవతల రాజు అయిన ఇంద్రుడు , ప్రత్యక్ష దైవం అయిన శ్రీ సూర్య భగవానుడు కూడా ఈ భీమేశ్వర స్వామీ నీ అర్చించి పూజించారని పురాణ ప్రతీతి.
తారకాసుర సంహారం తరువాత సప్తఋషులు , సప్త గోదావరీ పాయలతో వచ్చి పరమేశ్వరుడిని అభిషేకించాలి అని వస్తూ ఉండగా మార్గ మధ్య లో సప్తఋషులు తెస్తున్న సప్తగోదావరి జలాలు తన యజ్ఞాన్ని ముంచేస్తాయి అనే భయం తో తుల్య ఋషి అడ్డుపడతాడట ఇరువర్గాలు వాదోపవాదాలకు తెల్లారి పోయి ప్రభాత సూర్యుడు భీమేశ్వర స్వామిని తన అరుణోదయ కిరణాలతో సుప్రభాత అభిషేకం నిర్వహిస్తాడు అప్పుడు వ్యాస మహర్షి ఋషులను సాంతపరిచి ఆ సప్తగోదావరీ జలాలను అంతర్వాహినిగా మార్చి ఆలయ సమీపం లోని పుష్కరిణీ లో కలిపి ఆ పరమేశ్వరునికి అభిషేకం కావించారుట …అందుకే ఇప్పటికీ ఈ పుష్కరిణీ లో జలాలతో నే నిత్యం స్వామికి అభిషేకాలు చేస్తూ ఉంటారు.
పుష్కరిణీ ఎదురుగా ఉన్న దేవతా వృక్ష సముదాయం లో కొలువై ఉన్న శివుడు నీ భక్తులు పుష్కరిణీ జలాలతో స్వయం గా అభిషేకించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు ఏక శిలలో మలచిన నమూనా దేవాలయం అలయ ప్రాంగణం లో చూడవచ్చు , అష్ట దిక్పాలకులు మండపానికి ఎదురుగా స్వామీ ప్రధాన ఆలయ మండపం ను చీకటిమార్గం అని పిలుస్తారు ఆ మార్గం ద్వారానే ఆలయం లోకి ప్రవేశిస్తాము ఆనాటి రాతి కట్టడాలు గుడి ప్రాకారాలు ఎంతో అబ్బురపరిచే శిల్ప కళా సౌందర్యం తో ఈ దేవాలయం రెండు అంతస్తుల్లో కొలువుండే 14 అడుగుల శివలింగం ఈ క్షేత్ర ప్రత్యేకత అభిషేకాలు , అర్చనలు, మొదటి అంతస్తు నుండి అర్చకస్వాములు నిర్వహిస్తారు ప్రభాత భానుడి తొలి కిరణాలు స్వామీ నీ అర్చన చేస్తున్నట్టు లింగాన్ని తాకడం మరొక ప్రత్యేకత స్వామీ వారి గర్భాలయం లో గోడలకు పూర్వకాలం లో వజ్రాల తాపడాలు ఉండేవట ముష్కరుల దాడుల్లో ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారట …ఆ తాపడాల ఆనవాలు ఈ నాటికీ ఆ ఆక్రమణలకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి …స్వామీ వారి ఎదురుగా ఉన్న మహానంది నీ దర్శించుకొని అలోకిక ఆనందం తో అమ్మవారి దర్శనానికి కింది అంతస్తుకు చేరుకోవచ్చు ….అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటైన అమ్మవారు శ్రీ మాణిక్యమ్మ దేవిగా ఇక్కడ భక్తులు దర్శిస్తారు అమ్మవారి ఆలయాల్లో సామాన్యం గా అమ్మవారి మూల విరాట్టు ఎదురుగా శ్రీ చక్ర ప్రతిష్ఠ ఉంటుంది కానీ ఈ క్షేత్రం లో అమ్మవారిని శ్రీ చక్రం పై ప్రతిష్ఠ చేశారు…కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం గా అమ్మ భక్తులకు మాణిక్యాల దర్శనం ఇస్తారు …ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకొని ఆలయ ప్రాంగణం లో ఉన్నవీరముడి ఆంజనేయస్వామి నీ దర్శించుకోవచ్చు ఈ స్వామీ జుట్టు ముడివేసి “కొప్పు” లా అలంకరించి ఉంటుంది అందుకే స్వామీ ఇక్కడ ” వీరముడి ఆంజనేయస్వామి” గా కొలవబడుతున్నారు ఈ స్వామీ గద ధారణ లేకుండా నమస్కార ముద్ర లో ఉండడం మరొక ప్రత్యేకత , ఈ స్వామీ సన్నిధి సమీపం లోని ఒకే పానవట్టం పైన 108 శివలింగాలు దర్శనం ఇస్తాయి వీటిని దర్శిస్తే సర్వ క్షేత్రాలను దర్శించుకున్న ఫలితం లభిస్తుందని పెద్దలు చెపుతారు ఇక్కడ నవగ్రహాలు మండపం ఉండడమే కాక , అష్టదిక్పాలకులు కూడా మండపం ఉంటుంది .. అసామాన్యమైన ఎన్నో విశిష్టత ల సమాహారం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత … మనం దేవాలయం చేరుకోగానే బ్రాహ్మణోత్తములు మనకు క్షేత్ర విశేషాలు చెప్పే గైడ్ ల గా కూడా వ్యవహరించడం మరొక ప్రత్యేకత గా చెప్పవచ్చు …ఈ క్షేత్ర దర్శనం కి విచ్చేసిన భక్తులకు దేవస్థానం వారు స్వామి వారి అన్నప్రసాదాన్ని కూడా అందిస్తారు.

ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లా , రామచంద్రాపురం మండలం లో కాకినాడకు 32 కి.మి దూరం లో , రాజమహేంద్రవరం కు 60 కి.మి దూరం లో ఉంది ..కాకినాడ నుండి రాజమహేంద్రవరం నుండి ద్రాక్షారామంనకు ప్రతి గంటకు బస్సు సౌకర్యం కలదు.