కొవిడ్, ఈబీవీల‌తో యువ‌తిలో అసాధార‌ణ స‌మ‌స్య‌లు

కొవిడ్ ప‌లుర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను తీసుకొస్తోంది. కొవిడ్ వ‌చ్చి త‌గ్గిన త‌ర్వాత కొంత‌మందిలో క‌నిపించే ఎప్‌స్టీన్ బార్ వైర‌స్ (ఈబీవీ) లాంటి వాటి వ‌ల్ల ఆ త‌ర్వాతి కాలంలో ప‌లు ర‌కాల ఇబ్బందులు త‌లెత్తుతాయి. అలాంటి సంక్లిష్ట‌మైన ఒక కేసుకు విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుప‌త్రిలో వైద్యులు విజ‌య‌వంతంగా చికిత్స చేశారు. రోగి ప‌రిస్థితి గురించి, ఆమెకు అందించిన చికిత్స గురించి కిమ్స్ ఐకాన్ ఆసుప‌త్రిలోని క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్టు డాక్ట‌ర్ సీహెచ్ విజ‌య్ ఇలా వివ‌రించారు.

“అంత‌కుముందు ఆమెకు ఎలాంటి స‌మ‌స్య‌లూ లేవు. వ‌య‌సు కూడా కేవ‌లం 19 ఏళ్లు. కానీ, రెండు రోజుల జ్వ‌రం వ‌చ్చిన త‌ర్వాత న‌డుస్తుంటే అటూ ఇటూ ఊగ‌డం, కూర్చున్నా, నిల‌బ‌డినా స్థిరంగా ఉండ‌లేక‌పోవ‌డం, క‌నురెప్ప‌లు రెండూ ప‌దేప‌దే కొట్టుకోవ‌డం, బాగా మ‌త్తుగా ఉండ‌టం లాంటి ల‌క్ష‌ణాల‌తో విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుప‌త్రికి వ‌చ్చింది. క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ సీహెచ్ విజ‌య్ , డాక్ట‌ర్‌. మాన‌స‌ నేతృత్వంలో ప‌రీక్ష‌లు చేయ‌గా, ఆమెకు క‌నుగుడ్లు స్థిరంగా లేకుండా అటూ ఇటూ క‌దులుతున్నాయి. దానివ‌ల్ల ఆమె దేన్నీ స్థిరంగా చూడ‌లేక‌పోతోంది. కొంత నిద్ర‌మ‌త్తుగా అనిపిస్తున్నా.. లేపితే లేస్తోంది. చెప్పిన మాట‌లు వింటోంది. న‌రాల‌కు సంబంధించిన ప‌రీక్ష‌లు చేయ‌గా కాళ్లు, చేతుల‌లో కండ‌రాలు బాగానే ప‌నిచేస్తున్నాయ‌ని తేలింది. కానీ న‌డ‌క తీరు, నిల‌బ‌డ‌టం మాత్రం స‌రిగా లేదు. క‌నురెప్ప‌ల‌కు సంబంధించి మయోక్లోన‌స్, సాధార‌ణంగా మ‌యోక్లోనిక్ జెర్కులు, రెండు క‌ళ్ల‌కు సంబంధించి ఆప్సోక్లోన‌స్ జెర్కులు ఉన్నాయి. దాంతో ఆమెకు క‌ళ్లు, కాళ్ల కండ‌రాల స్థిర‌త్వ‌లోపం (ఓఎంఎస్‌) స‌మ‌స్య ఉంద‌ని నిర్ధారించి, దానికి వైద్య‌ప‌ర‌మైన కార‌ణాలేంటో క‌నుక్కునేందుకు ప్ర‌య‌త్నం చేశాము.

కంప్లీట్ బ్ల‌డ్ పిక్చ‌ర్, లివ‌ర్ ఫంక్ష‌న్, కిడ్నీ ఫంక్ష‌న్, హెచ్ఐవీ, హెచ్‌బీఎస్ ఏజీ, హెచ్‌సీవీ, కోయాగ్యులేష‌న్ ప‌రీక్ష‌ల‌న్నీ సాధార‌ణంగానే ఉన్నాయి. మ‌ధుమేహం, మెద‌డుకు తీసిన ప్లెయిన్, కాంట్రాస్ట్ ఎంఆర్ఐలు రెండూ బాగానే ఉన్నాయి. వాటిలో ఎలాంటి లోపం లేదు. దాంతో సీఎస్ఎఫ్ ప‌రీక్ష చేయ‌గా, అదీ నార్మ‌ల్ అనే వ‌చ్చింది. సీఎస్ఎఫ్ పారానియోప్లాస్టిక్ కూడా నార్మ‌లే. అంటే కేన్స‌ర్ లేద‌ని అర్థం. చెస్ట్ సీటీ స్కానింగ్, ఉద‌ర‌భాగానికి కూడా స్కానింగ్ చేసినా, అందులోనూ కేన్స‌ర్ ల‌క్ష‌ణాలు ఏవీ క‌నిపించ‌లేదు. ఈఈజీ కూడా సాధార‌ణంగానే ఉంది. టార్చ్ వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ యాంటీబాడీలు ఆమె శ‌రీరంలో లేవు. ఏఎస్ఓ టైట‌ర్లు, థైరాయిడ్ ప్రొఫైల్, యాంటీ థైరాయిడ్ యాంటీబాడీలు… అన్నీ సాధార‌ణ స్థాయిలోనే ఉన్నాయి. చివ‌ర‌కు చేసిన కొవిడ్ యాంటీబాడీ ప‌రీక్ష‌లు, ఈబీవీ యాంటీబాడీలు మాత్రం పాజిటివ్ అని తేలాయి” అని డాక్ట‌ర్ విజ‌య్ వివ‌రించారు.

అమ్మాయికి వ‌చ్చిన స‌మ‌స్య కొవిడ్ వ‌ల్ల వ‌చ్చిందా.. ఈబీవీ వ‌ల్ల వ‌చ్చిందా అనే విష‌యంలో అనుమానం వ‌చ్చిన‌ప్పుడు కొవిడ్ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తేలింది. రోగికి ఐదు రోజులు మీథైల్ ప్రెడ్నిసొలోన్ అనే మందు ఐవీ ప‌ల్స్ డోసుల‌తో చికిత్స చేశారు. ఆ త‌ర్వాత నోటి ద్వారా స్టిరాయిడ్ మాత్ర‌లు ఇచ్చారు. ఇలా మొత్తం 15 రోజులు చికిత్స చేసిన త‌ర్వాత రోగి పూర్తిగా సాధార‌ణ స్థితికి చేరుకుంది.

కేన్స‌ర్ వ‌స్తోంద‌ని తెలియ‌జేసే ముంద‌స్తు ల‌క్ష‌ణ‌మే ఓఎంఎస్‌. పెద్ద‌వారిలో ఓఎంఎస్ అనేది కేన్స‌ర్ వ‌ల్ల గానీ, వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ల వ‌ల్ల గానీ లేదా మ‌రే కార‌ణం తెలియ‌క‌పోయినా రావ‌చ్చు. ఇలాంటి కేసుల్లో 20-40 శాతం మందిలో మాత్రం కేన్స‌ర్ ప్రాథ‌మిక ద‌శ‌లో క‌నిపిస్తుంది. పెద్ద‌వారిలో అయితే స్మాల్ సెల్ లంగ్ కేన్స‌ర్, నాన్ స్మాల్ సెల్ లంగ్ కేన్స‌ర్, రొమ్ము కేన్స‌ర్, అండాశ‌య కేన్స‌ర్ లాంటివి వ‌స్తే ముందుగా ఓఎంఎస్ క‌నిపిస్తుంది. అదే కేన్స‌ర్ లేకుండా కూడా ఓఎంఎస్ వ‌చ్చిందంటే ప‌లు ర‌కాల ఇన్ఫెక్ష‌న్లు దానికి కార‌ణం కావ‌చ్చు. ప్ర‌ధానంగా ఈబీవీ, లైమ్స్ డిసీజ్, ఎంటెరోవైర‌స్, హెచ్ఐవీ, సాల్మొనెల్లా, సీఎంవీ వ‌ల్ల గానీ, స్ట్రెప్టోకోక‌ల్‌, యాంటీరూబెల్లా టీకాలు తీసుకున్న త‌ర్వాత రావ‌చ్చు. ప్ర‌స్తుత కేసులో ఈబీవీ యాంటీబాడీలు, కొవిడ్ యాంటీబాడీలు కూడా పాజిటివ్ ఉన్నాయి. కొన్ని కేసుల్లో మాత్ర‌మే ఈ పైన పేర్కొన్న ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. శ‌రీరంలో కేన్స‌ర్ లేక‌పోతే నాడీసంబంధ స‌మ‌స్య‌లు మాత్రం దాదాపు చాలావ‌ర‌కు స‌మ‌సిపోతాయి.