రాజ‌మండ్రి విశేషాలు మీకోసం

ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి, మీనాక్షి…

రాజ‌మండ్రి ఈ పేరు తెలియ‌న వారు ఉండ‌రు. కానీ ఆ ప్ర‌దేశం గురించి త‌క్కువ మంది ఎక్కువ విష‌యాలు తెల‌సు. ఆ ప్రాంతం గురించి మ‌రిన్ని విష‌యాలు మీకోసం.

ఎటు చూసినా గలగలా ప్రవహించే గోదావరి…ప్రకృతి ఒడిలో సేద తీరే నదిమద్య చారిత్రక నగరి .. అదే అదే రాజమహేంద్రి. నాటి రాజ‌మండ్రి. అఖండ గోదావరి గలగలలు మనకు స్వాగతం పలుకుతూ ఉన్నాయా అన్నట్టు పలకరిస్తాయి…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సాంస్కతిక నగరం గా పేరుపొందిన ఈ అద్భుతమైన నగరం కళలకు, ఘనచరితలకు ఆనవాలు గా చెప్పవచ్చు. ఈ నగరాన్ని మేటిదొరలు రెడ్డిరాజులు , రాజ రాజ నరేంద్రుడు పాలించారు అని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ ప్రవహించే అఖండ గోదావరి ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణ గా అగ్రస్థానం లో నిలిపింది అనడం లో అతిశయోక్తి లేదు ఎక్కడో మహారాష్ట్ర నాసిక్ లో పుట్టిన పవిత్ర గోదావరి తెలంగాణ రాష్ట్రం మీదుగా సుదూర ప్రయాణం చేసి అక్కడ నేలలో సిరులను కురిపిస్తూ పాపిడికొండలను దాటుకొని రాజమండ్రి కి చేరుతుంది ఇక్కడ మైదాన ప్రాంతంలో సేదతీరుతూ తూర్పు పశ్చిమ వాసులకు తన సోయగాలతో కనువిందు చేస్తూ ఏడుపాయలు గా చీలి ఇక్కడ రైతన్నల భూమిలో సిరులను పండిస్తోంది. స‌ర్ ఆర్థ‌ర్ కాటాన్ గోదావరి పై నిర్మించిన ఆనకట్ట వలన రాజమండ్రి లో గోదావరి నిత్యం కళకళలు ఆడుతూ ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి ఏడు పాయలను గౌతమి , వశిష్ట, వైనతేయ , ఆత్రేయ, భరద్వాజ , తల్యభాగ, కశ్యప, సప్తఋషులు నామాదేయలతో కీర్తింపబడుతున్నాయి

గోదావరి పైన 1974 లో నిర్మించిన గోదావరి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ఇప్పటికీ చెక్కు చెదరకుండా తూర్పు పశ్చిమ జిల్లాలను అనుసంధానం చేసే వారధిగా ఆసియా ఖండం లోనే అతిపెద్ద రోడ్ కం రైల్వే బ్రిడ్జి లలో మూడవ స్థానం లో ఉంది. రాజమండ్రికి ప్రధాన లాండ్మార్క్ మరియు ప్రధాన ఆకర్షణ కూడా ఇదే… ఆకాశ వీధిలో విహంగలను బ్రిడ్జి పైన భాగం లో కార్లు ,బస్సులను మధ్య భాగంలో కూతలు పెడుతూ పరుగులు పెట్టే రైళ్ళను …కింద నీటిపై తెరచాపలను పరుచుకున్న నావలను ఒకేసారి చూసే అద్భుతం బహుశా ఇక్కడే సాధ్యం ఏమో…గోదావరిపై నిర్మింపబడిన ఆర్చ్ బ్రిడ్జి కూడా చూపరులను భలే ఆకట్టు కుంటుంది.

వేదయుక్తమైన ఆధ్యాత్మిక నగరిగానే కాకుండా వ్యాపార రాజధానిగా కూడా రాజమండ్రీ ప్రసిద్దిపొందింది గోదావరి జిల్లాలలో సరసమైన ధరలలో నాణ్యమైన వస్తువులకు ఈ నగరం పెట్టింది పేరు తెలుగు రాష్ట్రాలలో వస్త్ర వ్యాపారరంగంలో దిగ్గజాలు అయిన బొమ్మనబ్రదర్స్ చందన బ్రదర్స్ , తుమ్మిడీ బ్రదర్స్ సంస్థలు ఇక్కడ నుండి తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టాయి తాడితోట ఓల్‌సెల్ మార్కెట్, మెయిన్ రోడ్ కోటగుమ్మంసెంటర్ లు నిత్యం రద్దీ గా వుంటే వ్యాపార ప్రదేశాలు.

ఎందరో కవులు కళకారులకు పుట్టినిల్లు రాజమహేంద్రవరం ప్రస్తుత సినీ రంగానికి చెందిన ప్రతీ వందమందికి 30మంది రాజమండ్రీ వాసులే ఉంటారని చెబుతారు.

సామాజిక దురాచారాలపై పోరాడిన సంఘసంస్కర్త , సాహితీ రచయిత శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు జన్మించిన పుణ్యభూమి వితంతు వివాహాలపై సామాజిక స్పృహ తో అప్పటి సమాజాన్ని చైతన్య పరచిన కలికితురాయి వారు … వీరేశ లింగం పంతులు గారు జన్మించిన ఇంటిని ప్రభుత్వం మ్యూజియంగా ఏర్పాటు చేసి నేటి తరానికి ఆయన కీర్తి నీ తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు.

ఆధ్యాత్మిక నగరి గా పేరుపొందిన రాజమహేంద్రవరం లో ఎన్నో దర్శించుకోవలసిన క్షేత్రాలు ఉన్నాయి….శ్రీ సారంగదీశ్వర దేవాలయం , శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ,శ్రీ ఉమా మార్కండేయ స్వామీ దేవాలయం , శ్రీ పాండురంగ స్వామీ దేవాలయం , రాజమహేంద్ర నగరి దేవతగా పిలవబడే సోమాలమ్మ దేవాలయం , జోడుగుళ్ళ శివాలయం , దేవిచౌక్, వేణుగోపాలస్వామి ఆలయం పుష్కర్ ఘాట్ సమీపంలోని పెద్ద ఆంజనేయ స్వామి దేవాలయం, గోదావరి ఒడ్డున ఉన్న ఎన్నో మఠాలు , ప్రముఖ దేవాలయాలు , ఇస్కాన్ మందిరం , అయ్యప్ప స్వామి దేవాలయం నిజం గా దర్శనీయ క్షేత్రాలు ఈ ప్రాంతం లో ప్రధాన భక్తి ముక్తి ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి.

ఇవే కాక కడియం నర్సరీలు ఈ నగరి కి మరొక ఆకర్షణ ఇక్కడ ఎటు చూసినా విరపూసిన పుల పరిమళాలు మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి .. ఇన్నర్ ప్లాంట్స్ , పూల పండ్ల తోటలతో ఇక్కడి ప్రదేశం ఎంతో కమనీయంగా దర్శనం ఇస్తుంది.
ధవళేశ్వరం లో ఉన్న కాటన్ మ్యూజియం కూడా సందర్శించి తీరవలసిందే అపర భగీరథుడు కాటన్ దొర నిర్మించిన ఈ బ్యారేజ్ ను అన్నదాతలు దేవాలయం గా భావిస్తారు ఈ ఆనకట్ట నిర్మాణాంతరo పండితులు గోదావరిలో స్నానమాచరించి
“నిత్య గోదావరి స్నాన పుణ్య దోయోమహామతీ: “
“స్మరామ్యాగ్లేయం దేశీయం కాటనం తం భగీరథః” అని సంకల్పం చెప్పేవారట మాకు గోదావరి స్నాన పుణ్యాన్ని కలిగించిన కాటన్ దొరగారిని నిత్యం స్మరించి తరిస్తున్నాము అని ఈ శ్లోకానికి అర్ధం …ఈ విధం గా 18వ శతాబ్దం లో పవిత్ర జీవనది పైన జలాశయం నిర్మించిన అపర భగీరథుడు ఆయన

ఇక కేంద్ర కారాగారం బ్రిటిష్ కాలం నాటి డచ్ వ్యాపారులు నిర్మించిన కోట 1947 లోనే ఇది కేంద్ర కారాగారం గా పేరుపొందినది ఎందరో స్వతంత్ర సమరయోధులు ఈ కారాగారం నుండి తమ దేశభక్తిని చాటుకొని ఉద్యమ స్ఫూర్తిగా నిలిచారు.

భారతదేశం లో స్వదేశీ ఉద్యమం సమయం లో ఆ స్ఫూర్తి తో 1930 లో మొట్టమొదటి ఫౌంటైన్ పెన్ కు ఇక్కడే ఫౌండర్ శ్రీ రత్నం గారు శ్రీకారం చుట్టారు …మహాత్మా గాంధీ తో పాటు ఎందరో స్వతంత్ర సమర యోధులు , రాష్ట్రపతులు , ప్రధానులు, నచ్చిన మెచ్చిన రత్నం పెన్స్ నేటికీ తన సేవలను అందిస్తోంది..

ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి భారతదేశం లోని 12 పవిత్ర జీవనదులు పుష్కరాలు వస్తాయి బృహస్పతి సింహ రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు జరపవలసినదిగా పుష్కర శాస్త్రం లో వివరణ చెపుతోంది ఆ సమయం లో భూమండలంలో తీర్థాలు ఇతర లోకాల లోని పవిత్ర తీర్తాలన్ని గోదావరిలో కలిసి ఉంటాయని ఈ సమయం లో త్రిమూర్తులు ఈ ప్రదేశం లో కొలువు ఉంటారని సప్తఋషులు ,పితృదేవతలు , సర్వదేవతలూ ఒక పర్వం కాలం పాటు ఇక్కడే ఉండి తమ ఆశీర్వచనం అందిస్తారని ఇతిహాసాల ద్వారా చెప్పబడినది ..ఆధునీకరణ చేసిన అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా 2015 లో గోదావరి నదీ పుష్కరాలు రాజమహేంద్రవరం లో నిర్వహించారు.

ఇక్కడ దొరికే రోసేమిల్క్ కు ఎంతో పేరు ఉంది ఆ రుచిని ఆస్వాదించవలసిందే.. గంగరాజు డైరీ వారు తయారు చేసే పాలకోవా కుడా ఎంతో అమోఘమైన రుచి కలిగి ఉంటుంది. ఈ విధంగా అన్ని కోణాలలోను వెయ్యేళ్ళ చరిత్రకు ఆనవాలుగా ఉన్న ఈ మహానగరాన్ని ఒక్కసారి అయినా దర్శించి తరించవలసినదే.