ద్వారకా తిరుమల పుణ్య‌క్షేత్రం

మీనాక్షి, ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి

ద్వార‌కా తిరుమ‌ల ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌సిద్ది చెందిన పుణ్య‌క్షేత్రం ఇది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చిన్న తిరుప‌తిగా పేరుగ‌డించిన ఈ క్షేత్రం భ‌క్తుల‌పాలిట కొంగుబంగారంగా మారింది. శ్రీ వేంక‌టేశ్వ‌రుడి ద‌ర్శ‌నం కోసం దేశంలోని అనేక ప్రాంతాల నుండి ఇక్క‌డి చేరుకుంటారు. ఈ క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నం చద‌వండి.

ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్ఛిమగోదావరి జిల్లాలో ఉన్నది. ఏలూరు నుండి 42 కి.మీ. దూరంలో ఉన్నది. ఏలూరు నుండి ద్వారకా తిరుమలకు మూడు బస్సు దారుల ద్వారా వెళ్ళవచ్చు. వయా భీమడోలు (15 కి.మీ.) వయా తడికపూడి మరియు దెందులూరు నుండి కూడా వెళ్ళవచ్చు. విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళు అన్ని రైళ్ళు ఏలూరు రైల్వేస్టేన్‌లో ఆగుతాయి. చుట్టు ప్రక్కల దేవాయాలకు దేవస్థానం వారు రోజుకు రెండుసార్లు మాత్రం ఉచిత బస్సు నడుపుచున్నారు. .

స్థలపురాణం :
ఇక్కడ స్వామి శ్రీ వేంకటేశ్వరుడు. చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధిచెందినది. ద్వారక అనే ముని పేరుమీదగా ఈ క్షేత్రం ఏర్పడినదని అంటారు. స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. పెద తిరుపతి వెళ్ళలేనివారు చిన్న తిరుపతిగా పేరుపొందిన ఇక్కడ మ్రొక్కులు తీర్చుకున్నా అదే ఫలితం లభిస్తుందంటారు. .
ద్వారకుడు అనే ముని స్వామివారి పాదసేవను కోరటం జరిగింది కనుక పాదములను పూజించే భాగ్యం అతనికి దక్కిందని అంటారు. స్వామివారి పైభాగం మనకు దర్శనమిస్తుంది. శ్రీరామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి మరొక నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించాడని అంటారు. ఒక్కడ స్వామివారికి అభిషేకము చేయరు. చిన్న నీటిబొట్టు పడినా అది స్వామివారి విగ్రహము క్రింద వున్న ఎర్రచీమలను కదుల్చునని చెబుతారు. .
స్వామివారికి ప్రతి సంవత్సరం రెండుసార్లు వైశాఖ మాసం మరియు ఆశ్వియుజ మాసాలలో కళ్యాణోత్సవాలు జరుపుతారు. ఇందుకు కారణం స్వామి స్వయంభువుగా వైశాఖంలో దర్శనమిచ్చాడని మరియు ఆశ్వయుజంలో స్వామివారి సంపూర్ణ విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. .
గుడి ప్రవేశద్వారం వద్ద కళ్యాణమండపం ఉన్నది. దీని ప్రక్కన పాదుకామండపంలో స్వామివారి పాదాలున్నాయి. శ్రీవారి పాదాలకు నమస్కరించి భక్తులు కొండపైకి ఎక్కుతారు. మనం ఇక్కడ ద్వారకాముని, అన్నమయ్య విగ్రహాలను, గర్భగుడి చుట్టూఉన్న ఆళ్వారు విగ్రహాలను దర్శించవచ్చు. ఆంజనేయస్వామి, గరుడ మందిరాలను కూడా చూడవచ్చు. అర్ధమండపం ప్రక్కనే తూర్పుముఖంగా మంగతాయారు, ఆండాళ్‌ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష పూజ చేస్తారు. .
స్వామివారి పుష్కరిణి : గ్రామానికి పశ్ఛిమంలో స్వామివారి పుష్కరిణి ఉన్నది. ఈ పుష్కరిణిని సుదర్శన పుష్కరిణి, నరసింహసాగరం, కుమారతీర్థమని కూడా అంటారు. చక్రతీర్థం, రామతీర్థం అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ప్రతి సంవత్సరం కార్తీకశుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) రోజున స్వామివారికి తెప్పోత్సవం జరుపుతారు.