హైదరాబాద్‌కు విస్తరించిన వెంచర్‌ కేటలిస్ట్స్‌

దేశంలోని అతిపెద్ద ఇంక్యుబేటర్‌, యాక్సెలరేటర్లలో ఒకటైన వెంచర్‌ కేటలిస్ట్స్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో పదివేల మంది ఏంజెల్‌ ఇన్వెస్టర్ల నెట్‌వర్క్‌ను సిద్ధం చేసి అంకుర సంస్థలను, అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దాలనేది తమ లక్ష్యమని వెంచర్‌ కేటలిస్ట్స్‌ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం ఈ సంస్థ 45 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. దక్షిణాదిలోని హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై నగరాలు… అంకుర సంస్థలకు కేంద్రస్థానాలుగా ఎదుగుతున్నాయని, నైపుణ్యం కల మానవ వనరులు, ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు ఉండటం దీనికి ప్రధాన కారణమని వెంచర్‌ కేటలిస్ట్స్‌ అధ్యక్షుడు అపూర్వ రంజన్‌ శర్మ పేర్కొన్నారు. అంతేగాక ఈ నగరాల్లో ఏంజెల్‌ ఇన్వెస్టర్ల సంఖ్యా అధికంగా ఉందన్నారు. కేవలం ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా, ద్వితీయ- తృతీయ శ్రేణి నగరాలకు చెందిన అంకుర సంస్థలకు సైతం అండగా నిలవాలనేది తమ లక్ష్యమని ఆయన వివరించారు.