అనంతపురంలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి
శరీరంలో మూత్రపిండాల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. వివిధ కారణాల వల్ల వాటి పనితీరు బాగా మందగించినప్పుడు కిడ్నీ మార్పిడే సరైన మార్గం. అయితే ఇంతకాలం పెద్ద నగరాల్లో మాత్రమే ఇది జరుగుతుండటంతో మారుమూల ప్రాంతాల వాళ్లు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల వాసులు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకోడానికి వెనకడుగు వేసేవారు. శస్త్రచికిత్స జరిగిన తర్వాత దాదాపు ఆరు నెలల పాటు అదేచోట ఉండాల్సి రావడం, వీటి గురించి అవగాహన తక్కువగా ఉండటం, ఖర్చు ఎక్కువగా ఉండటం, మూత్రపిండాలు అందుబాటులో లేకపోవడం లాంటివి ఇందుకు ప్రధాన కారణాలు. అయితే, రాయలసీమలోని అనంతపురం కిమ్స్ సవీరా ఆసుపత్రిలో సైతం ఇప్పుడు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స మొదలైందని నెఫ్రాలజిస్టు, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ వి. బద్రీనాథ్, యూరాలజిస్టు, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ దుర్గాప్రసాద్ చెప్పారు. ఈ ఆసుపత్రిలో విజయవంతంగా జరిగిన తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స గురించిన వివరాలను వారు చెప్పారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి చెందిన బోయ వీరభద్ర వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. ఆరు నెలల క్రితం అతడికి వాంతులు, కాళ్లవాపులు, ఇతర లక్షణాలు కనపడటంతో కిమ్స్ సవీరా ఆసుపత్రికి వచ్చాడు. వైద్య పరీక్షల్లో అతడి మూత్రపిండాలు బాగా పాడైనట్లు తెలియడంతో ముందుగా ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ ప్రారంభించాము. రీనల్ బయాప్సీ చేయగా, అతడికి ఐజీ ఏ నెఫ్రోపతీ ఉన్నట్లు తేలింది. ఈలోపు కిమ్స్ సవీరా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ కొనసాగించాము. అతడి చెల్లెలు తన మూత్రపిండం దానం చేసేందుకు ముందుకొచ్చింది. దాంతో పోలీసు, రెవెన్యూ, న్యాయ శాఖలతో పాటు ఆథరైజేషన్ కమిటీ నుంచి కూడా అనుమతులు తీసుకుని, ఆరోగ్యశ్రీ పథకంలో కిడ్నీ మార్పిడి చేయాలని నిర్ణయించాం.
ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు నేతృత్వంలో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ వి. బద్రీనాథ్, యూరాలజిస్టు, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ దుర్గాప్రసాద్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ జితేంద్ర, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ పూర్ణ, ఎనస్థీషియా బృందం కలిసి సెప్టెంబర్ 5న కిమ్స్ సవీరా ఆసుపత్రిలో అనంతపురంలోనే తొలిసారిగా కిడ్నీ మార్పిడిని విజయవంతంగా చేశారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో దాతను 5 రోజుల తర్వాత, గ్రహీతను మరో 5 రోజుల తర్వాత డిశ్చార్జి చేశారు. దీంతో, 100 కిలోమీటర్ల దూరం నుంచి వారానికి మూడుసార్లు డయాలసిస్ కోసం రావాల్సిన అవసరం వీరభద్రకు లేకుండా పోయింది.
ఈ మొత్తం ప్రక్రియలో నెఫ్రాలజిస్టు, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ వి. బద్రీనాథ్ పాత్ర చాలా కీలకం. సమస్యను గుర్తించడం, తీవ్రతను అంచనా వేయడం, రోగి కుటుంబం నుంచే దాతను చూడటం, లేదా మరణానంతర దాతలను చూడటం, ఇద్దరినీ పరీక్షించి మ్యాచ్ చేయడం.. ఇలా ప్రతి అడుగూ ముఖ్యమే. దాత ఆరోగ్యం కూడా చూసుకోవాలి. శస్త్రచికిత్సకు ముందు, తర్వాత రోగికి రోగనిరోధకవ్యవస్థను ఆపేసేందుకు మందులు ఇవ్వాలి. అప్పుడే కొత్త మూత్రపిండాన్ని శరీరం అడ్డుకోకుండా ఉంటుంది. ఇద్దరికీ దాదాపు ఒకే సమయంలో శస్త్రచికిత్స చేసి, దాత నుంచి సేకరించిన మూత్రపిండాన్ని రోగికి అమర్చాలి. తర్వాత కూడా దాదాపు ఆరు నెలల నుంచి ఏడాది పాటు గ్రహీతను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యి, గ్రహీత సాధారణ స్థితికి చేరుకుంటేనే శస్త్రచికిత్స విజయవంతం అయినట్లు. మార్పిడి జరిగిన తొలి ఆరు నెలల్లో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు వెళ్లకుండా, తరచు చేతులు కడుక్కుంటూ, మాస్కు ధరించి, ఇంట్లో వండిన ఆహారమే తింటూ, రక్షిత మంచినీరు తాగుతుండాలి.
కన్సల్టెంట్ యూరాలజిస్టు, లాప్రోస్కోపిక్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ జి.దుర్గాప్రసాద్ కిడ్నీమార్పిడి శస్త్రచికిత్స గురించి వివరించారు. కిడ్నీ మార్పిడి అంటే, ఒక వ్యక్తి నుంచి కిడ్నీ తీసి మరో వ్యక్తికి అమర్చడం మాత్రమే కాదని, అందులో నూటికి నూరుశాతం కచ్చితత్వంతోపాటు అత్యంత నైపుణ్యం అవసరమని ఆయన చెప్పారు. దాత నుంచి కిడ్నీ తీసి, దాన్ని గ్రహీతకు అమర్చి, మళ్లీ రక్తప్రసారాన్ని పునరుద్ధరించే సమయం (ఇష్కేమియా టైం) ఎంత తక్కువ అయితే అంత త్వరగా గ్రహీత తక్షణం, మరియు దీర్ఘకాలంలో కోలుకుంటాడని తెలిపారు. అనంతపురం, చుట్టుపక్కల జిల్లాల్లో దీర్ఘకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ జీవితం భారంగా గడుపుతున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కిడ్నీ మార్పిడితో తమ జీవితకాలం పెంచుకోవచ్చని డాక్టర్ దుర్గాప్రసాద్ అన్నారు.