అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో ఆరుదైన చికిత్స
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి లైఫ్ సపోర్ట్ మీద ఉండి, కొవిడ్-19 కూడా ఉన్న బాధితుడి ప్రాణాలను అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి (ఎల్బీ నగర్) వైద్యులు కాపాడారు. పరిస్థితి తీవ్రత వల్ల రోగి బతికే అవకాశాలు కేవలం 10% మాత్రమే ఉన్నా, కేవలం ఆసుపత్రిలోని వైద్యుల నైపుణ్యం, వారి ప్రయత్నాల వల్లనే అతడి ప్రాణాలు నిలబడ్డాయి.
జూన్ 28వ తేదీన 18 ఏళ్ల వయసున్న షాబాజ్ నగరంలో జరిగిన ఒక ప్రమాదంలో దారుణంగా గాయపడటంతో అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడికి పలుచోట్ల ఎముకలు విరిగాయి. దాంతోపాటు మెదడుకు కూడా గట్టి దెబ్బ తగలడంతో అతడు చాలా వేగంగా కోమా పరిస్థితిలోకి వెళ్లిపోయేలా ఉన్నాడు. అతడిని కాపాడి, కోమా నుంచి బయటకు తెచ్చేందుకు పలు విభాగాల వైద్య నిపుణులు అవసరమయ్యారు. కానీ, చికిత్స సమయంలో చేసిన పరీక్షలలో రోగికి కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో పాటు వైరస్ లోడ్ కూడా చాలా ఎక్కువ ఉండటంతో అతడు కోలుకునే అవకాశాలు సన్నగిల్లాయి.
ఈ కేసు సంక్లిష్టత గురించి చికిత్స విధానం మొత్తానికి నేతృత్వం వహించిన అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలోని కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, “ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి ఆ కుర్రాడు కోమా పరిస్థితిలో ఉన్నాడు. అతడి వైటల్స్ అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. దాంతో బతికే అవకాశాలు చాలా సన్నగిల్లిపోయాయి. అయితే, వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు, నేను కలిసి ఆశ వదులుకోకుండా కొన్ని రోజుల పాటు బాగా ప్రయత్నించి, అతడు కోలుకునేలా చేయగలిగాం” అని చెప్పారు.
“చికిత్స విధానంలో భాగంగా చేసిన పరీక్షల్లో కొవిడ్-19 అని తేలి, రోగి పరిస్థితి మరింత విషమం అయ్యింది. వైరస్ లోడ్ చాలా ఎక్కువగా ఉంది. ఒకవైపు విరిగిన ఎముకలకు చికిత్స, మరోవైపు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌కు చికిత్స రెండు చేస్తూ అతడు పూర్తిగా కోలుకునేలా చూడాల్సి వచ్చింది. పూర్తగా కోలుకున్నాక రోగిని జులై 24వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశాము. ఇటీవలే అతడిని మరోసారి ఆసుపత్రిలో పూర్తిగా పరీక్షించాము. ఇప్పుడు రోజువారీ పనులన్నీ చేసుకుంటున్నాడు” అని అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలోని కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ గౌరీశంకర్ తెలిపారు.
ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంటు డాక్టర్ అహ్మద్ అలీఖాన్, కన్సల్టెంట్ రేడియాలజిస్టు డాక్టర్ మునీశ్వర్, ఇతర వైద్య సిబ్బంది సహకారం లేనిదే ఈ కేసులో ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో చికిత్స సాధ్యమయ్యేది కాదు. అతడు దాదాపు కోలుకులేని పరిస్థితుల్లో కొవిడ్-19తో బాధపడుతున్నా వీళ్లంతా నింతరం చికిత్సను పర్యవేక్షిస్తూ, ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు.