కార్వీ ఛైర్మన్ అరెస్ట్
కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, ఎండి పార్థసారథిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రెండు బ్యాంకులకు రూ.484 కోట్లు ఎగవేసిన ఆరోపణలపై వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయని, ఇండస్ ఇండ్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. గచ్చిబౌలి కేంద్రంగా పని చేసే కేఎస్‌బీఎల్ సంస్థ.. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టరై ఉంది. ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను ఈ సంస్థ పర్యవేక్షించేది. ఆయా ఖాతాల్లో క్లయింట్ల షేర్లతో పాటు నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టి వాటి విలువలో 80 శాతం వరకు రుణం పొందొచ్చు. దీన్ని అనువుగా మార్చుకుని మదుపరుల అనుమతి లేకుండా డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి పార్థసారథి మార్చుకున్నారు. ఆ షేర్లను కొలేటరల్ సెక్యూరిటీగా పెట్టి దాదాపు రూ.680 కోట్ల వరకు అప్పు తీసుకున్నారు. ఈ మొత్తాలను తమ సొంత కంపెనీల్లోకి మళ్లించడం, రుణాలు చెల్లించి షేర్లను తిరిగి మదుపరుల ఖాతాల్లోకి పంపడం ఏళ్లుగా సాగింది.