కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో తొలిసారి మూత్రపిండాల మార్పిడి
శరీరంలో మూత్రపిండాల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. వివిధ కారణాల వల్ల వాటి పనితీరు బాగా మందగించినప్పుడు మూత్రపిండాల మార్పిడే సరైన మార్గం. అయితే ఇంతకాలం పెద్ద నగరాల్లో మాత్రమే ఇది జరుగుతుండటంతో మారుమూల ప్రాంతాల వాళ్లు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల వాసులు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకోడానికి వెనకడుగు వేసేవారు. ఈ శస్త్రచికిత్స జరిగిన తర్వాత రోగి దాదాపు ఆరు నెలల పాటు అదేచోట ఉండాల్సి రావడం, వీటి గురించి అవగాహన తక్కువగా ఉండటం, ఖర్చు ఎక్కువగా ఉండటం, మూత్రపిండాలు అందుబాటులో లేకపోవడం లాంటివి ఇందుకు ప్రధాన కారణాలు. అయితే, రాయలసీమలోని కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో సైతం ఇప్పుడు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స మొదలైందని కన్సల్టెంట్ యూరాలజిస్టు, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ సీహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. తమ ఆసుపత్రిలో విజయవంతంగా జరిగిన తొలి మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స గురించిన వివరాలను ఆయన చెప్పారు.
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పి.సల్మాన్ (26)కు 2020 నవంబర్ నుంచి వాంతులు, ఊపిరి పీల్చుకోవడంలో కష్టం మొదలయ్యాయి. అతడికి వైద్య పరీక్షలు చేయించగా సీరమ్ క్రియాటినైన్ 22 ఎంజీ/డీఎల్ ఉంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా మూత్రపిండాల పరిమాణం బాగా తగ్గినట్లు తెలిసింది. అతడు బాడీబిల్డర్ కావడంతో పోషకాహారం/ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటాడు. బహుశా వాటివల్ల సమస్య వచ్చి ఉండొచ్చు. వృత్తిరీత్యా అతడు ప్లంబర్. వ్యాధి బయటపడటంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో అతడికి హీమోడయలాసిస్ చేశారు. తర్వాత తన తండ్రి రుస్తుమ్ ఖాన్ (45) ఒక మూత్రపిండం ఇస్తారని మార్పిడి కోసం కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. దాతకు, రోగికి తగిన పరీక్షలు చేసిన తర్వాత దాత మూత్రపిండాల పనితీరు బాగుండటం, టిష్యూ కూడా సరిపోవడంతో జూన్ 30న మార్పిడి శస్త్రచికిత్స చేశారు. రోగి ఆరోగ్య పరిస్థితి మొత్తం కుదుటపడిన తర్వాత అతడిని జులై 19న డిశ్చార్జి చేశారు.
శస్త్రచికిత్స మొత్తం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో జరిగింది. శస్త్రచికిత్సకు రెండు రోజుల ముందునుంచి ఇమ్యునోసప్రెసెంట్ మాత్రలు, శస్త్రచికిత్స రోజు ఇంజెక్షన్ ఇచ్చారు. దానివల్ల రోగి శరీరం కొత్త మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉంటుంది. డిశ్చార్జి అయిన తర్వాత కూడా ఒక్కరోజు సైతం మానకుండా ఇమ్యునోసప్రెసెంట్ మందులు వాడాలని అతడికి సూచించారు. ఆరు నెలల కాలంలో క్రమంగా డోసు తగ్గిస్తారు. అయితే, జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. తొలి ఆరు నెలల్లో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు వెళ్లకుండా, ఇంట్లో వండిన ఆహారమే తింటూ, రక్షిత మంచినీరు తాగుతుండాలి. దాతను శస్త్రచికిత్స జరిగిన ఆరు రోజుల తర్వాతే డిశ్చార్జి చేశారు. రెండు వారాల తర్వాత ఇంటి పనులు, మూడు నెలల తర్వాత బరువు పనులు కూడా ఆయన చేసుకోవచ్చని తెలిపారు.
మూత్రపిండాల మార్పిడి ప్రక్రియ మొత్తంలో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ పాత్ర చాలా కీలకం. వ్యాధిని గుర్తించడం దగ్గర నుంచి ఇది మొదలవుతుంది. వ్యాధి తీవ్రతను అంచనా వేయడం, దాతను గుర్తించడం, వాళ్ల మూత్రపిండాలు వీళ్లకు సరిపోతాయో లేదో తెలుసుకోవడం ముఖ్యం. దాత ఆరోగ్యాన్ని పూర్తిగా అంచనా వేయాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సకు ముందు, తర్వాత రోగికి రోగనిరోధకవ్యవస్థను ఆపేసేందుకు మందులు ఇవ్వాలి. అప్పుడే కొత్త మూత్రపిండాన్ని శరీరం అడ్డుకోకుండా ఉంటుంది. ఇద్దరికీ దాదాపు ఒకే సమయంలో శస్త్రచికిత్స చేసి, దాత నుంచి సేకరించిన మూత్రపిండాన్ని రోగికి అమర్చాలి. తర్వాత కూడా దాదాపు ఆరు నెలల నుంచి ఏడాది పాటు రోగిని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యి, రోగి సాధారణ స్థితికి చేరుకుంటేనే శస్త్రచికిత్స విజయవంతం అయినట్లు. కిమ్స్‌లో ఈ ప్రక్రియను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ కె. అనంతరావు దిగ్విజయంగా పూర్తిచేశారు.











