కొవిడ్-19 పూర్తిగా పోయేముందే “థ‌ర్డ్‌వేవ్‌”ను ఎదుర్కోండి

  • కొవిడ్ థ‌ర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవ‌డంపై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించిన గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యులు

డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో : గ‌తంలో అత్యున్న‌త స్థాయి నుంచి కొవిడ్-19 కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయినా, ప్ర‌జ‌లు మ‌ళ్లీ సాధార‌ణ జీవ‌నం గ‌డ‌ప‌డానికి, పూర్తిగా ఊపిరి పీల్చుకోవ‌డానికి ఇంకా స‌మ‌యం ఉంది! ఇప్ప‌టికీ న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య ఆందోళ‌న‌క‌ర‌మే. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఏమాత్రం నిర్ల‌క్ష్యంగా ఉన్నా ప‌రిస్థితి మ‌రింత విష‌మించి, ఉత్పాతం సంభ‌విస్తుంది. థ‌ర్డ్‌వేవ్‌లో పెద్ద‌సంఖ్య‌లో కేసులు వ‌స్తే వాటిని ఎదుర్కోవ‌డం ఎలాగ‌న్న అంశంపై గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యులు సోమవారం ఒక అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు.

చైనాలోని వుహాన్‌లో 2019 న‌వంబ‌రులో క‌రోనా వైర‌స్ కేసులు మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఈ వైర‌స్‌కు కొవిడ్‌-19 అని పేరు పెట్టారు. ఇది అన్ని ఖండాల‌కూ వ్యాపించి, ఇత‌ర స‌మ‌స్య‌లు, మ‌ర‌ణాల సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచింది. మొద‌టిద‌శ త‌గ్గుతున్ రెండు నెల‌ల్లోనే రెండోద‌శ కూడా వ‌చ్చింది. కొవిడ్ సోకిన‌వారిలో చాలామందికి ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌డం, వ్యాధి తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌టం నుంచి కొన్ని కేసుల్లో మాత్రం తీవ్ర‌త చాలా ఎక్కువ‌గా ఉంది. త్వ‌ర‌గా చికిత్స మొద‌లుపెట్టిన‌వారు పెద్ద ఇబ్బంది లేకుండానే కోలుకున్నారు. వివిధ కార‌ణాలతో ల‌క్ష‌ణాల‌ను నిర్ల‌క్ష్యం చేసిన‌వారు, సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చే సందేశాల‌ను న‌మ్మి ఊరుకున్న‌వారు మాత్రం ఒక‌మాదిరి నుంచి తీవ్ర‌మైన స‌మ‌స్యలు ఎదుర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి క‌న్స‌ల్టెంట్ ప‌ల్మ‌నాల‌జిస్టు, స్లీప్ మెడిసిన్ నిపుణులు డాక్ట‌ర్ సుధీర్ ప్రసాద్ మాట్లాడుతూ, “ప్ర‌స్తుతం ఇంకా సాధార‌ణ ప‌రిస్థితులు రాలేదు. కొవిడ్-19పై పోరాటంలో మాస్కు అత్యంత సుల‌భ‌మైన‌, చాలా ముఖ్య‌మైన మార్గం. స‌రిగా ధ‌రిస్తే మామూలు స‌ర్జిక‌ల్ మాస్కు లేదా వ‌స్త్రంతో చేసిన మాస్కు కూడా స‌రిపోతుంది. ఆరోగ్య‌రంగంలో ప‌నిచేసేవారు, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు, పోలీసులు, అత్య‌వ‌స‌ర సేవ‌లు అందించేవారు మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ఎన్95 మాస్కులు ధ‌రించాలి. మాస్కును చేత్తో మాత్రం తాక‌కండి. ఒక‌సారి ముట్టుకుంటే మాత్రం వెంట‌నే చేతులు స‌బ్బుతో గానీ, శానిటైజ‌ర్‌తో గానీ శుభ్రం చేసుకోండి. అవ‌స‌రం లేనిదే ర‌ద్దీ ప్ర‌దేశాల్లోకి వెళ్ల‌ద్దు” అని సూచించారు.

“కొవిడ్-19 వైర‌స్ ఇన్ఫెక్ష‌న్‌తో పోరాటంలో వాక్సినేష‌న్ రెండో ముఖ్య‌మైన అంశం. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల‌న్నీ స‌మ‌ర్థ‌మైన‌వి. అర్హులైన‌వారంతా వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్లు వేయించుకోవాలి. వ్యాధి తీవ్ర‌త‌ను, ఆసుప‌త్రిలో చేరాల్సిన అవ‌స‌రాన్ని, చివ‌ర‌కు మ‌ర‌ణాన్ని కూడా నిరోధించేందుకు వ్యాక్సిన్ ఉప‌యోగ‌ప‌డుతుంది. వ్యాక్సిన్ వేయించుకున్న త‌ర్వాత కూడా వ్యాధి సోక‌చ్చు గానీ, ల‌క్ష‌ణాలు చాలా స్వ‌ల్పంగా ఉంటాయి. వ్యాక్సిన్ల గురించి అవాస్త‌వ‌లు ప్ర‌చారం కావ‌డంతో ఇంకా చాలామంది ముందుకు రావ‌ట్లేదు. కొవిడ్-19 వైర‌స్ రాబోయే కొంత‌కాలం పాటు వాతావ‌ర‌ణంలో ఉండిపోవ‌చ్చు. అందువ‌ల్ల మ‌రిన్ని ద‌శ‌లు సంభ‌వించే ప్ర‌మాద‌ముంది” అని క‌న్స‌ల్టెంట్ ప‌ల్మ‌నాల‌జిస్టు, స్లీప్ మెడిసిన్ నిపుణులు డాక్ట‌ర్ సుధీర్ ప్రసాద్ తెలిపారు.

మాస్కులు ధ‌రించ‌డం, చేతులతో దేన్ని తాకిన‌వెంట‌నే చేతులు శానిటైజ్ చేసుకోవ‌డం, ఇత‌రుల నుంచి దూరం పాటించ‌డం, వ్యాక్సినేష‌న్ తీసుకోవ‌డం లాంటివాటిని కొన‌సాగిస్తూ ఈ మ‌హమ్మారిపై పోరాటం కొన‌సాగించాలి. ఇవ‌న్నీ సుల‌భ‌మైన‌వి, అయినా స‌మ‌ర్ధ‌మైన చ‌ర్య‌లు. వీటితో వ్యాధి ముప్పును, వ్యాప్తిని అడ్డుకోవ‌చ్చు.