కారెక్కిన కౌశిక్ రెడ్డి
అందరూ అనుకున్నట్లుగానే కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం తెరాసలో చేరారు. ఈ మేరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కౌశిక్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి తనకు చిరకాల మిత్రుడని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి సాయినాథ్ రెడ్డి పని చేశారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఆకాంక్షతోనే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడిపోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని కేసీఆర్ అన్నారు. శాశ్వతంగా ఏ పార్టీ కూడా అధికారంలో ఉండదని చెప్పారు. ఎప్పుడూ అధికారంలో ఉండటానికి ఇది రాచరిక వ్యవస్థ కాదని అన్నారు. టీఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ తెలిపారు. కౌశిక్ ను ఎవరూ ఆపలేరని… ఆయన ఉన్నతికి తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కౌశిక్ రెడ్డి బాధ్యతలను నిర్వహించిన సంగతి తెలిసిందే.