చిన్నారికి పునర్జన్మనిచ్చిన కిమ్స్
- చిన్నారికి కొవిడ్ సోకడంతో సంక్లిష్టంగా మారిన శస్త్రచికిత్స
- ఎంతో జాగ్రత్తగా ఆపరేషన్ చేసి బిడ్డకు పునర్జన్మ
మెదడు భాగంలో క్యాన్సర్ ట్యూమర్.. అదీ ఏకంగా మెదడులో మూడో వంతు సైజులో పెద్ద గడ్డ.. పైగా కొవిడ్ పాజిటివ్.. ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో తమ దగ్గరకు వచ్చిన నాలుగేళ్ల బిడ్డకు సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టారు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు. ముందుగా కొవిడ్‌కు చికిత్స చేసి నయం చేశారు. తర్వాత రెండు వారాల్లో మెదడుకు శస్త్రచికిత్స చేసిన కేన్సర్ కణాలను తొలగించారు. ప్రస్తుతం తమ బిడ్డ కోలుకోవడంతో ఇంటికి తీసుకువచ్చామని ఆ పాప తల్లిదండ్రులు చెప్పారు. కామారెడ్డి జిల్లా భవానీపేటకు చెందిన పుల్లూరి కిషన్ కుమార్తె చైత్రిక (4) ఐదారు నెలలుగా తరచూ వాంతులు చేసుకోవడం, రాత్రిళ్లు నిద్ర లేకపోవడంతోపాటు నీరసంగా ఉండేది. కుడిచేతితో కనీసం గ్లాస్ కూడా ఎత్తలేకపోయేది. స్థానికంగా వైద్యులను సంప్రదించినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో కిషన్ తన బిడ్డను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చైత్రికకు పరీక్షలు నిర్వహించగా బ్రెయిన్‌ట్యూమర్ అని తేలింది. శస్త్ర చికిత్స చేసి ఆ ట్యూమర్‌ను తొలగించామని కిమ్స్ హాస్పిటల్స్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ పాణిగ్రాహి చెప్పారు. చికిత్స వివరాలను ఆయన వెల్లడించారు.
మెదడులో మూడో వంతు సైజులో ట్యూమర్
చైత్రిక అనే చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో ఏప్రిల్ నెలలో కిమ్స్‌కు తీసుకొచ్చారు. ఎంఆర్ఐ స్కాన్ చేయగా అది క్యాన్సర్ సంబంధితమైన గడ్డ అని తేలింది. మెదడులోని ఇన్సులా అనే భాగానికి ట్యూమర్ వచ్చింది. ఇది కాలు, చేయి యొక్క కదలికలను నియంత్రించే భాగం. మెదడులో దాదాపు 30 శాతం భాగాన్ని ఆక్రమించిన ఈ ట్యూమర్‌ను తొలగించాలంటే చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స చేయాలి. ఇలా శస్త్రచికిత్స చేసి తొలగించేటప్పుడు మెదడుకు రెండోవైపున బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువ. ట్రాక్టోగ్రఫీ ఎంఆర్ ఐస్కాన్ ద్వారా మెదడు కదలికలను గుర్తించి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. అంతకు ముందు పరీక్షల్లో భాగంగా కొవిడ్ టెస్ట్ చేస్తే బిడ్డకు పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆ పాపకు కిమ్స్‌లోనే డాక్టర్ నందకిషోర్ ఆధ్వర్యంలో కొవిడ్‌కు చికిత్స చేశారు. రెండు వారాల్లో కోలుకున్నాక మే 12న శస్త్రచికిత్స చేశాం. నాలుగు రోజుల్లోనే ఆ పాప చాలావరకు కోలుకోవడంతో మే 16న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశాం. ఇప్పుడు ఆ పాప ఆరోగ్యంగా ఉంది.
కరోనా వల్ల మరింత సంక్లిష్టం
చిన్నారి కరోనా బారిన పడి ఉండటంతో శస్త్రచికిత్స చాలా సంక్లిష్టంగా మారింది. ఎందుకంటే కొవిడ్ సోకినవారిలో రక్తం గడ్డకట్టడం అనేది ఎక్కువగా జరుగుతోంది. అందుకే వారికి తర్వాత బ్లడ్ థిన్నర్స్ కూడా ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చైత్రికకు శస్త్రచికిత్స చాలా వేగంగా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వ్యక్తికి ఆపరేషన్ చేయడం ప్రాణాంతకం. అత్యంత వేగంగా చేయకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. పోనీ కొన్నాళ్లపాటు ఆగి కొవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గాక శస్త్రచికిత్స చేద్దామంటే ఆ బిడ్డకు ట్యూమర్ చాలా పెద్దగా ఉంది. వెంటనే తొలగించకపోతే ఆ పాప ప్రాణాలకే ముప్పు అని కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఆపరేషన్ పూర్తి చేశాం.
సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయం
చైత్రికకు నాలుగైదు నెలల కిందట ట్యూమర్ వచ్చింది. తల్లిదండ్రుల జెనటిక్స్ పరంగా పాపకు ఈ వ్యాధి ఉండొచ్చు. సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే ముందుగా చేతి కదలికలు ఆగిపోతాయి. తర్వాత అది కాలికి వ్యాపిస్తుంది. కాలు చేయీ కదలికలు లేకపోవడంతో మంచానపడే పరిస్థితి వస్తుంది. వెంటనే వైద్యం చేయకపోతే మూడు నెలల్లోపే ప్రాణాలు కోల్పోవచ్చు కూడా. ప్రస్తుతానికి చిన్నారి తాత్కాలికంగా క్యాన్సర్ నుంచి బయటపడింది. అయితే తర్వాత రేడియో థెరపీ,కీమోథెరపీ చేయించాలి. ఈ ట్యూమర్ స్థాయి ప్రభావాన్ని బట్టి గ్రేడ్లు ఉంటాయి. గ్రేడ్ 3 పిల్లల్లో శస్త్రచికిత్స చేయించిన 2 ఏళ్ల వరకు మళ్లీ ఎలాంటి సమస్య తలెత్తదు. కానీ చైత్రిక అనే ఈ చిన్నారికి గ్రేడ్ 4. కాబట్టి 9 నుంచి 12 నెలల్లోనే తిరిగి ఏదో భాగానికి క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ పాపకు నాలుగు నెలలకు ఒకసారి స్కానింగ్ చేయించాలి. ఆమె శరీరంలోని ఏ భాగానికైనా మళ్లీ ట్యూమర్ వచ్చిందా అనేది పరీక్షిస్తూఉండాలి అని డాక్టర్ మానస్ పాణిగ్రాహి వివరించారు.