యుద్ధవిమానాలు కొన్న 20 ఏళ్లకు షెడ్ల నిర్మాణం…!

అబ్బబ్బబ్బా… ఈ టైంలో గనుక రాఫెల్ యుద్ధవిమానాలు మన చేతుల్లో ఉండి ఉంటే, నాసామిరంగా పాకిస్థాన్‌ను ఓ ఆటాడుకునేవాడిని…… అన్నాడు మోడీ..! నిజమే, సుమీ… మొన్న మన సైనిక స్థావరాలను ధ్వంసం చేద్దామని పాకిస్థాన్ 20 యుద్ధవిమానాలను పంపించింది కదా, రాఫెల్ ఉండి ఉంటే కథ వేరేగా ఉండేది… కనీసం సగం విమానాల్ని కూల్చేసి ఉండేవాళ్లం…… అన్నాడు ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్…! సరే, రాఫెల్ విమానాలు లేవు, మరి మనకు రష్యా ఇచ్చిన ది గ్రేట్ సుఖోయ్ విమానాల సంగతేమిటి..? పాకిస్థాన్ ఒకేసారి 20 విమానాలతో దాడికి వస్తే, మరీ ఆ డొక్కు మిగ్ విమానాలే ఎదురుదాడికి, రక్షణకు ఉపయోగపడ్డాయా..? సుఖోయ్ విమానాలను షెడ్లలో పెట్టి, పూజలు చేస్తున్నారా..? ఇదీ ప్రశ్న… కీలక ప్రశ్నే… నిజం చెప్పాలంటే, ఆ పూజలు చేయాలంటే వాటికి ఆ షెడ్లు కూడా లేవు… అదీ జవాబు… షెడ్లు లేవు కాబట్టే మనం సరిహద్దుల్లో వాటిని రెడీగా ఉంచడం లేదు… అందుకని అందుబాటులో ఉన్న ఆ పాత డొక్కు మిగ్‌లే పంపించాల్సి వచ్చిందట… అఫ్‌కోర్స్, ఆ మిగ్‌లో వెళ్లీ మన అభినందనుడు అత్యంతాధునిక పాకిస్థానీ ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాడు… అది వేరే సంగతి…

ఎప్పుడో 1996 నుంచీ 272 ఎయిర్ క్రాఫ్టులను మనం రష్యా నుంచి తెప్పించుకోవాలనేది ఒప్పందం… 240 దాకా వచ్చేశాయి… కానీ వాటికి రక్షణ కోసం మాంచి బలమైన షెడ్లు కావాలి కదా… వాటి నిర్మాణం మాత్రం మరిచిపోయారు… నిజమే… ఈ విమానాలు ఓపెన్‌గా ఉంటే, ఏ శత్రువు విమానమో వేగంగా వచ్చి వీటిపైనే బాంబింగు చేసి వెళ్తే, తుక్కు తుక్కు అయిపోతాయి… 1965 యుద్ధంలో పాకిస్థాన్ మన యుద్ధవిమానాల్ని కొన్నింటిని ఇలాగే దెబ్బతీసింది కూడా… అందుకని వాటికీ షెడ్లు కావాలి… అవీ వాస్తవాధీన రేఖ వద్ద ఉంటే శత్రువు దాడికి దిగిన వెంటనే తిప్పికొట్టడానికి గాలిలో లేచేలా… అరెరె, సుఖోయ్‌‌లకు షెడ్లు లేవు కదా, మరెలా ఇప్పుడు అని 2011-13 ప్రాంతంలో అప్పటి ఎయిర్ ఫోర్స్ చీఫుకు డౌటొచ్చి, అప్పుడు ప్రతిపాదనలు పంపించాడట… కానీ అనేకానేక ప్రతిపాదనల కాగితాల నడుమ అదీ నిద్రపోయింది చాలారోజులు… 2016లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీన్ని గమనించి ప్రభుత్వానికి ఓ రిపోర్టు ఇచ్చింది… కాస్త ఇప్పటికైనా ఆ షెడ్లు కట్టండర్రా అంటూ..! 2017 చివరలో మోడీ సర్కారు వాటి నిర్మాణానికి వోకే అన్నది… వారెవ్వా, రష్యా నుంచి ఆ యుద్ధ విమానాలు కొన్న ఇరవయ్యేళ్లకు వాటికి షెడ్లు కట్టుకుంటున్నాం అన్నమాట… ఆహా… ఇదండీ మన యుద్ధసన్నద్ధత, ప్రణాళిక..!! ఈ షెడ్లనే బ్లాస్ట్ పెన్స్ అంటారు… పైనుంచి 2000 పౌండ్ల బాంబు వేసినా చెక్కుచెదరనంత దృఢంగా కడతారు… మరి ఇప్పుడేం చేస్తున్నాం..? వాస్తవాధీన రేఖకు చాలా లోపలకు, ఎక్కడో మన వైమానిక దళస్థావరాల్లో ఉంచుతున్నాం వీటిని… మన రక్షణశాఖ నిర్వాకాల్ని తవ్వేకొద్దీ ఇలాంటివి ఇంకెన్నో కథలు… ఇదంతా సరే, అన్ని వేల కోట్లు పెట్టి కొంటున్నాం కదా, రాఫెల్ యుద్ధవిమానాలపై బాగా ఆశలు పెట్టుకుంటున్నాం కదా, మరి వాటికి షెడ్ల మాటేమిటి..? కట్టేద్దాం లెండి, తొందరేముంది..? మరో ఇరవయ్యేళ్లకు చూసుకుందాం… అదీ ఏ రిలయెన్స్ ఇన్‌ఫ్రా కంపెనీకో కంట్రాక్టు ఇప్పిద్దాం… సరేనా..?!