ఇక నుండి వారంలో మూడు రోజులే ఆఫీస్
ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ హైబ్రిడ్ పని విధానంలోకి మారుతోంది. దీని ప్రకారం గూగుల్ ఉద్యోగులు ఇక నుంచి మూడు రోజులు ఆఫీసులోను, రెండు రోజులు తమకు ఎక్కడ మంచిదనిపిస్తే అక్కడ నుంచి పని చేస్తారు. గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. తమ ఉద్యోగులు వారంలో అన్ని పని దినాలు రిమోట్ ప్రాంతం నుంచే పని చేసేందుకు అనుమతి కోరు తూ దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తామని పిచాయ్ తెలిపారు. 2021 మొదటి త్రైమాసికం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో 1,39,995 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. భారత్‌లో బెంగళూరు, హైదరాబాద్, ముంబై, గురుగ్రామ్‌లలో కంపెనీ కార్యాలయాలు నిర్వహిస్తోంది. ఒకసారి కరోనా అదుపులోకి వస్తే ఇప్పటివరకు పరస్పరం కనిపించని వారందరూ ఒకరినొకరు చూసుకుని కలిసి పని చేయగలుగుతామని పిచాయ్ అన్నారు. కాగా రిమోట్ ప్రాంతం నుంచి పనిచేసే ఉద్యోగులు దాదాపు మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం వరకు ఉంటారని గూగుల్ అంచనా వేస్తోంది.