పుట్ట మధు మిస్సింగ్ వెనుక అసలు కథ ?
పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచే ‘గాయబ్’ అయిన పుట్ట మధు ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. జిల్లా పరిషత్ చైర్మన్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండగా, ఆయన ఎక్కడికి వెళ్లలేదని పోలీసులు చెపుతున్నారు. అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన మంథనిలో ఏం జరుగుతోందో కూడా పోలీసులకు తెలియకుండా ఉంది. నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లతో పుట్ట మధుకు రక్షణ కల్పిస్తున్న రామగుండం పోలీసులు ఇంత జరుగుతున్నా.. మధు ఎక్కడికి వెళ్లలేదని, దేశంలోనే ఉన్నారని చెబుతూ వచ్చారు.
ఎన్ని పుకార్లు షికార్లు చేసినా.. పోలీసులు చెపుతున్న దానిని బట్టి పుట్ట మధు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తన బంధువుల దగ్గరో.. సన్నిహితుల వద్దో ఉంటారని భావించవచ్చు. పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ, కుమారుడు, కోడలు నేరుగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎంను కలిసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సీఎం అందుబాటులో లేకపోవడంతో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కలిసి తన భర్త ఆచూకీ కోసం తాము పడుతున్న బాధను సీఎంకు తెలియజేయాలని కోరినట్లు సమాచారం.
వీడని సస్పెన్స్ ఎపిసోడ్..
సుమారు వారం రోజుల క్రితం పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లిన విషయాన్ని సాక్షాత్తూ టీఆర్‌ఎస్ నేతలే ధ్రువీకరిస్తున్నారు. అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడం, అదే సమయంలో రాష్ట్ర పోలీస్ శాఖలోని ఉన్నతాధికారి నుంచి ఫోన్ రావడంతో వారం క్రితమే ఆయన మంథని నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారని సమాచారం. హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పిన మధు.. తనకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని మంథనిలోనే వదిలి, ఆయన భార్య శైలజ కారులో వెళ్లినట్లు తెలుస్తోంది. మ«ధు వాహనం ప్రస్తుతం ఆయన మామ ఇంట్లో పార్కింగ్ చేసి ఉంది. మంథని నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లినట్లు సమాచారం.
ఆయన సెల్ ఫోన్ సిగ్నిల్ చివరగా మహారాష్ట్రలోని సెల్ టవర్ క్యాచ్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని ‘వని’ పట్టణంలో పుట్ట మధు సోదరుడు, మరో బంధువు ఇంట్లో అక్కడి జిల్లా పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి విచారణ జరిపినట్లు ఆ రాష్ట్రంలోని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. కాగా.. మహారాష్ట్ర నుంచి వస్తున్న వాహనాలను ఆసిఫాబాద్‌లోని వాంకిడి వద్ద పట్టుకొని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధు మంథని నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లినట్లు స్పష్టమవుతోంది. అయితే.. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారనే ప్రచారం ఉంది. కానీ.. పోలీసులు దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు.
గన్‌మెన్లు ఎక్కడ..?
పుట్ట మధు వెంటే గన్‌మెన్లు ఉన్నారని ఏఆర్ ఏసీపీతోపాటు రామగుండం పోలీస్ కమిషనర్ చెపుతుండగా.. పుట్ట మధు ఎక్కడున్నారనే విషయంలో ఇంత కథ ఎందుకు జరుగుతుందనేది ప్రశ్నగా మిగిలింది. నలుగురు గన్‌మెన్లు మధుతో ఉంటే ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినా.. వారం రోజులుగా గన్‌మెన్ల ఆచూకీ పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు కనుక్కోలేదా అని తెలియకుండా ఉంది. పుట్ట శైలజ తన భర్త ఆచూకీ చెప్పాలని ప్రభుత్వ పెద్దలను కలిసి కోరుతున్న వేళ ఇప్పటికీ గన్‌మెన్లు మధు వెంటే ఉన్నారని పోలీస్ కమిషనర్, ఏఆర్ ఏసీపీ సుందర్‌రావు చెప్తున్నారంటే.. వారి మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందో ప్రభుత్వానికే తెలియాలి. ప్రస్తుతం పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన పుట్ట మధు వ్యవహారంలో నిజాలను బహిర్గత పరచాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది.
మంత్రి కొప్పులతో టచ్‌లో..
అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మధు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర నుంచి నేరుగా హైదరాబాద్‌కు వచ్చిన పుట్ట మధు టీఆర్‌ఎస్ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. వామన్‌రావు హత్య కేసుతోపాటు ఈటల రాజేందర్ వ్యవహారంలో కూడా తన ప్రమేయం లేదని సీఎం కేసీఆర్‌కు చెప్పించేందుకు ఆయన ప్రయత్నించినట్లు తెలిసింది. రాష్ట్రానికి చెందిన మంత్రులు ఇద్దరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
కాగా గురువారం పుట్ట మధు భార్య శైలజ, ఆమె కుమారుడు, కోడలితో కలిసి హైదరాబాద్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలువగా, తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన సూచన మేరకు వెనుదిరిగినట్లు సమాచారం. అదే క్రమంలో ఆర్‌అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్‌ను కలిసి తన భర్త మధు ఆచూకీ ఐదు రోజులుగా దొరకడం లేదని.. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కోరారు.