క్షయని తక్కువ అంచనా వేయవద్దు
అంతర్జాతీయ క్షయ వ్యాధి దినోత్సవం – మార్చి 24
డాక్టర్. కోనా మురళీధర్ రెడ్డి,
కన్సల్టెంట్ ఇంటర్వేషనల్ పల్మోనాలజిస్ట్
కిమ్స్ సవీర, అనంతపురం.
ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయ (టిబి) వ్యాధి దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా క్షయ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ క్షయ వ్యాధి నివారించదగిన, వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు మన దేశంలోల టిబి వ్యాధిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు సుమారు 4000 మంది టిబి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
మైకో బాక్టీరియమ్, ట్యూబర్కలోసిస్ అనే బాక్టీరియాల వల్ల ఈ క్షయ వ్యాధి సోకుతుంది.
టిబి వ్యాధి ఎలా సంక్రమిస్తుంది ?
టిబి బాక్టీరియా ఒకరి నుండి మరొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఊపిరితిత్తులు లేదా గొంతు టిబి ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు లేదా మాట్లాడినప్పుడు టిబి బాక్టీరియాలు గాలిలోకి ప్రవేశిస్తాయి. వాటిని మరొక వ్యక్తి పీల్చినప్పుడు టిబి వ్యాధి సోకుతుంది.
ప్రపంచ జనభాలో సుమారుగా నాల్గవ వంతు మంది ఇప్పిటికే టిబి ఇన్ఫెక్షన్‌కు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచాన. వీరందరిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే టిబి ఇన్ఫెక్షన్ 5-10 శాతం మందికి టిబి వ్యాధిగా మారే ప్రమాదం ఉంది.
టిబి వ్యాధి కేవలం ఊపిరితిత్తుల జబ్బేనా ?
టిబి వ్యాధి సాధరణంగా ఊపిరితిత్తులకు సంక్రమిస్తుంది. కొన్ని సార్లు ఈ వ్యాధి మెడ చుట్టూ ఉన్న లింఫ్ గ్రంథులకు ( లింఫ్ నోడ్ టిబి), వెన్నెముకకు (స్పైన్ టిబి), మెదడు (టిబి మైనింజైటిస్), గుండెకు, ఎముకలకు మరియు కీళ్లకు ఇలా మన శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు.
ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ?
ఊపిరితిత్తుల టిబి వచ్చిన వారికి దీర్ఘకాలిక (రెండు వారాల కంటే ఎక్కువ) దగ్గు, గళ్ల పడడం, జ్వరం, ఛాతీ నొప్పి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, కొన్ని సార్లు దగ్గినప్పుడు రక్తం పడడం వంటి లక్షణాలు కనిసిస్తాయి.
ఈ వ్యాధిని గుర్తించడం ఎలా?
పై లక్షణాలు ఉన్న వారు సరైన సమయంలో సంప్రదిస్తే వారికి ఛాతీ ఎక్స్ రే లేదా సి.టి స్కాన్, గళ్ల పరీక్ష వంటి వివిధ పరీక్షలు నిర్వహించి ఈ వ్యాధని గుర్తిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి కొన్నిసార్లు బ్రాంకోస్కోపి వంటి పరీక్షలు కూడా వ్యాధి నిర్ధారణకు అవసరమయ్యే అవకాశముంది.
ఈ వ్యాధికి చికిత్స ఉందా?
సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ చేస్తే, ఊపిరితిత్తుల టిబిని మందులతో వందశాతం తగ్గించవచ్చు. అయితే సాధరణ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (న్యూమోనియా) లాగా కాకుండా టిబి చికిత్స చాలా కాలం (6 నెలల వరకు ఉంటుంది). వ్యాధి నిర్ధారణ పరీక్షలలో డిఆర్‌టిబి ( మందులకు లొంగని టిబి) అని తేలితే అటుంటి రోగికి ప్రత్యేక చికిత్స అందిచవలసి ఉంటుంది.
టిబి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలును అడ్డుపెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల నివారించవచ్చు. ఇంట్లో లేదా పని చేసే ప్రదేశంలో టిబి ఉన్న వ్యక్తితో ఉన్నా.. తొందరగా టిబి పరీక్షలు చేయించాలి. వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స తీసుకోవాలి.