కిడ్నీలో “క్రికెట్‌బాల్” సైజు అంత ట్యూమర్
కిడ్నీలో “క్రికెట్‌బాల్” సైజు అంత ట్యూమర్..
లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా తొలగించిన అవేర్ గ్లోబల్ ఆస్పత్రి డాక్టర్ అమన్‌చంద్ర
కీహోల్ ద్వారా ఇంత పెద్ద కణితిని తొలగించడమనేది అరుదైన సర్జరీ
అవేర్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. 55 ఏళ్ల వయస్సు గల వ్యక్తి కుడి వైపు కిడ్నీలో “క్రికెట్ బాల్” సైజులో ఉన్న ట్యూమర్‌ను అధునాతనమైన లాప్రోస్కోపిక్ సర్జరీ కీహోల్ ద్వారా విజయవంతం చేసి అతడిని ప్రాణాపాయం నుంచి రక్షించారు. శుక్రవారం అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు హాస్పిటల్ వైద్యులు శస్త్ర చికిత్స వివరాలను వెల్లడించారు. మూత్రపిండాల నుంచి ఇంత పెద్ద పరిమాణంలోని ట్యూమర్‌ను తొలగించడానికి లాప్రోస్కోపిక్ కీహోల్ శస్త్రచికిత్స చేయడం అనేది అరుదైన సర్జరీగా డాక్టర్లు చెప్పారు. అయితే రోగి త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో పాటు శరీరానికి గాయాలు, కోతలు లేకుండా కీహోల్ సర్జరీ చేసినట్లు వివరించారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనుబాబు మూత్రపిండాల సమస్య తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. రోగికి వివిధ పరీక్షల అనంతరం కుడి మూత్రపిండంలో క్యాన్సర్ లక్షణాలతో కూడిన పెద్ద సైజులో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. బాధితుడి ప్రాణాలు రక్షించాలంటే వెంటనే సర్జరీ చేసి ట్యూమర్‌ను తొలగించాలన్న అంచనాకు వచ్చారు. అయితే ఇది సాధారణంగా ఓపెన్ ఆపరేషన్ కోత పెట్టి సర్జరీ చేయకుండా ఆధునికమైన లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స కీహోల్ ద్వారా చేయాలని నిర్ణయించారు. రోగి సర్జరీ తర్వాత వేగంగా కోలుకోవడంతో పాటు ఆపరేషన్ కంటే కీహోల్ సర్జరీ చేస్తే వేగంగా కోలుకుంటావని ఎటువంటి బాధ లేకుండా పూర్తి చేస్తామని వివరించారు. శ్రీనుబాబు కూడా డాక్టర్లు చెప్పిన సూచనలకు అంగీకరించి సర్జరీకి సిద్ధమయ్యాడు.
ఈ సందర్భంగా పేషెంట్‌కు శస్త్ర చికిత్సను చేసిన తీరును అవేర్ గ్లోబల్స్ ఆస్పత్రుల ప్రముఖ యూరాలజిస్ట్, కన్సల్టెంట్ డాక్టర్ అమన్ చంద్ర , గ్లెనిగల్ గ్లోబల్ ఆస్పత్రుల హైదరాబాద్ రీజియన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ మెర్విన్ లియో తో కలిసి విలేకర్లకు వివరించారు. “ బాధితుడికి ఈ పరిస్థితి రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే ఏది ఏమైనా రోగికి సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేసి ట్యూమర్‌ను నొప్పి లేకుండా తొలగించాలంటే లాప్రోస్కోపిక్ సాంకేతికతో కీ హోల్ సర్జరీ ఉత్తమమైన మార్గంగా నిర్ణయించుకున్నాం. వెంటనే కుడి కిడ్నీకి నెఫ్రోక్టమీ సర్జరీ చేసి క్రికెట్ బాల్ సైజ్ లో ఉన్న ట్యూమర్‌ను తొలగించాం. సాధారణంగా సంప్రదాయ పద్ధతిలో ఆపరేషన్ చేస్తే రోగి కోలుకోవడానికి ఎక్కువ సమయంతో బెడ్‌రెస్ట్ ఎక్కువగా అవసరమవుతుంది. కానీ ఆధునిక పద్ధతులతో చేసే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం ద్వారా రోగి వేగంగా కోలుకుంటారు. అందుకే ఈ సర్జరీ తర్వాత రోగి వేగంగా కోలుకుని చక్కగా ఉండడంతో 3వ రోజున డిశ్చార్జి చేశాం. ఈ లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స చేయడం ద్వారా బహిరంగంగా ఎటువంటి పెద్ద గాయాలు, నొప్పులు ఉండవు. అదే విధంగా శరీరంలో నుంచి ఎటువంటి రక్తం నష్టం కూడా జరుగదు. చికిత్స కూడా వేగంగా పూర్తవుతుంది. సంప్రదాయ ఆపరేషన్ చేస్తే గాయాలు, నొప్పులతో వెంటనే జ్వరం వస్తుంది. రోగి ఏదైనా సర్జరీ నుంచి వేగంగా కోలుకోవాలంటే జ్వరం రాకుండా ఉండడం ఎంతో ముఖ్యం. అదే విధంగా సున్నితమైన మూత్రపిండాలకు ఓపెన్ ఆపరేషన్ చేస్తే.. శరీరంలోని కణజాలం దెబ్బతిని సరికావడానికి కూడా సమయం పడుతుంది కాబట్టి రోగికి ఇబ్బంది లేకుండా లాప్రోస్కోపిక్ సర్జరీ చేశాం”. అని తెలిపారు. ఈ సమావేశంలో ఆస్పత్రి డాక్టర్లు, సహాయక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.