మళ్లీ పడగ విప్పుతున్న కరోనా
ప్రపంచాన్ని ఒక ఏడాది పాటు ఒక కుదుపు కుదిపేసిన కరోనా గత కొన్ని నెలలుగా కాస్తా తగ్గుముఖం పట్టింది అనుకున్నారు అంతా. ఇంతలోనే మళ్లీ కరోన తన పడగవిప్పి నాట్యం చేస్తోంది. ఏమాత్రం అలసత్వం వహించినా ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే అని అంటున్నారు వైద్యరంగ నిపుణులు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ లౌక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.
మహారాష్ట్రలోని విదర్భలో గణనీయంగా కరోనా కేసులు పెరగడంతో అక్కడి ప్రభత్వం అప్రమత్తమై పలు చోట్ల లాక్‌డౌన్ విధించింది. అక్కడి నుండి ముంబాయి, పుణే లాంటి జనసంద్రం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు విస్తరించకుండా ప్రణాళికలు చేపడుతున్నారు. దీన్ని ఇక్కడే కట్టడి చేయకపోతే దేశ వ్యాప్తంగా మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ విధించే అవకాశం ఏర్పుడుతుంది. గత నాలుగు నెలల నుండి చప్పుడు చేయని కరోనా ఇప్పుడు ఏకంగా నిత్యం దాదాపు 8 వేల కరోన కేసులు నిత్యం బయటపడుతుండటంతో అక్కడి ప్రజల్లో భయాందోళన పెరిగింది. మళ్లీ సామాజిక దూరం పాటిస్తూ… మాస్క్‌లు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దేశ వ్యాప్తంగా ప్రజలను హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు వైద్యులు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా కేసులు తగ్గుముఖం పట్టడంతో కరోనా సమాచారం కోసం నిత్యం విడుదల చేసే హెల్త్ బులెటిన్‌ని… వారం రోజులకు ఒకసారి విడుదల చేస్తామని ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించింది. మరోవైపు మహారాష్ట్ర వేదిక పెరుగుతున్న కేసులతో ఇక్కడి ప్రభుత్వం అప్రమత్తమై ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.