మహిళ కంటిలో ఉసిరికాయంత ట్యూమర్‌కి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
నోస్ ఎండోస్కోపీ సర్జరీ ద్వారా కన్నును కాపాడిన వైద్యులు
విశాఖపట్టణం, ఫిబ్రవరి 24, 2021:
ఎడమ కన్నులోని కనుగుడ్డు కింది భాగంలో ఉసిరికాయ పరిమాణంలో(3సెం.మీ) ట్యూమర్ ఏర్పడిన మహిళకు అత్యంత అరుదైన నోస్ ఎండోస్కోపి శస్త్ర చికిత్స చేసి కిమ్స్ ఐకాన్ వైద్యులు మహిళ కన్నును కాపాడారు. యలమంచిలికి చెందిన ఓ మహిళ , గృహిణి (34) గత కొద్ది రోజులుగా తలనొప్పితో పాటు ఎడమ ముక్కు నుంచి బ్లీడింగ్ అవుతుందని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి, ఈఎన్‌టీ విభాగం అధిపతి, కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ సాయి బలరామకృష్ణను సంప్రదించింది. ఆమెను పరీక్షించిన డాక్టర్ పలు రకాల పరీక్షలు నిర్వహించి కంటిలో గుర్తించిన ట్యూమర్‌ను నోస్ ఎండోస్కోపీ సర్జరీ చేసి ట్యూమర్‌ను తొలగించినట్లు తెలిపారు.
ఈ అరుదైన ఆపరేషన్ గురించి డాక్టర్ సాయి బలరామకృష్ణ వివరిస్తూ ” మహిళ ఎడమ ముక్కుద్వారా బ్లీడింగ్ జరుగుతుందని చెప్పడంతో వెంటనే నోస్ ఎండోస్కోపీ చేయగా ఎటువంటి సమస్య కనిపించలేదు. అయితే సాధారణంగా ఇటువంటి ముక్కులోని సమస్యలను నోస్ ఎండోస్కోపీ ద్వారానే పరిష్కరిస్తాం. కానీ నోస్ ఎండోస్కోపీలో ఎటువంటి సమస్య కనిపించకపోవడంతో సీటీ స్కాన్ చేశాం. అయితే కంటిలోని కనుగుడ్డును పైకి నెట్టుతున్నట్లు ఒక ట్యూమర్ కన్ను ముక్కు మధ్య భాగంలో కనిపించింది. ఆ ట్యూమర్ కన్నులోపలి భాగంలోని కన్నుకు ముక్కుకు మధ్య స్థలాన్ని అంతా ఆక్రమించి కనుగుడ్డును బయటకు తోసేలా ప్రమాదకరంగా ఉంది. వెంటనే ఆప్తమాలజిస్టుల సలహా తీసుకుని తగు జాగ్రత్తలు పాటిస్తూ నోస్ ఎండోస్కోపి ద్వారా కంటిలోపలి గుడ్డుకింద ఉన్న ట్యూమర్‌ను తొలగించాం. ఉసిరికాయ కంటే కూడా పెద్ద పరిమాణంలో ఉన్న ట్యూమర్‌ను కంటి పై భాగం నుంచి కాకుండా ఎండోస్కోపీ ద్వారా సర్జరీ చేసి తొలగించడమనేది వైద్య చరిత్రలో అరుదైన విషయం. అయితే ఈ శస్త్ర చికిత్సలో మరో సున్నితమైన అంశమేమిటంటే ట్యూమర్‌పై ఉండే పొర కంటి భాగానికి ఎక్కువగా అతుక్కుని ఉంది. కన్నుకండరాలు ఎటువంటి డ్యామేజ్ లేకుండా దానిని ఎండోస్కోపి ద్వారా కట్‌చేసి తొలగించాం. ఇటువంటి సర్జరీలు ఇప్పటి వరకు చాలా తక్కువగా జరిగాయి. నేను కూడా ఈ తరహా సర్జరీ చేయడం ఇదే మొదటి సారి. ఆరు సంవత్సరాల క్రితం తలకు చిన్న దెబ్బ తగిలిందని పేషెంట్ వివరించింది.. కానీ, ఈ తరహా సమస్యలు ఎక్కువగా పుట్టుకతోనే ఏర్పడుతూ క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఒక వేళ ఈ ట్యూమర్‌ను కనుక తొలగించకుంటే కన్నుపై ఒత్తిడి పెరిగి పాడైపోయి కంటిచూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉండేది. ఇంకా కొంత ఆలస్యమైతే సర్జరీ కూడా చేయలేని పరిస్థి ఉండేది. చాలా నైపుణ్యంతో సర్జరీ చేశాం. సర్జరీ తర్వాత పేషెంట్ వేగంగా కోలుకుంది. బ్లీడింగ్ ఆగిపోవడంతో పాటు తలనొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయిందని చెప్పింది. ఆ తర్వాతనే ఆమెను డిశ్ఛార్జి చేశాం. ” అని డాక్టర్ సాయి బలరామకృష్ణ చికిత్స విధానాన్ని వివరించారు.
డెర్మాయిడ్ సిస్ట్ కిందనే ట్యూమర్ ను పరిగణించామని, పలురకాల పరీక్షల కోసం పాథాలజీ ల్యాబ్‌కు కూడా పంపించామని డాక్టర్ సాయి బలరామకృష్ణ చెప్పారు. అయితే ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు కూడా లేవని నిర్ధారణ అయ్యిందన్నారు. సాధారణంగా నోస్ ఎండోస్కోపీ ద్వారా ముక్కులో ఉండే సమస్యలను క్లియర్ చేస్తాం. మెదడులోనుంచి ప్లూయిడ్ లీక్ అయినా.. బ్రెయిన్‌లో ఏవైనా ట్యూమర్స్ స్టీనాయిడ్స్ ద్వారా క్లియర్ చేస్తాం. అదే విధంగా కంటిలోని సమస్యలను కూడా నోస్ ఎండో స్కోపీ ద్వారా క్లియర్ చేసి కంటి చూపు పోకుండా క్లియర్ చేయడమనేది చాలా అరుదైన విషయమని డాక్టర్ సాయి బలరామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్ సాయి బలరామకృష్ణ, ఆస్పత్రి సిబ్బంది కంటికి రెప్పలా చూసుకోవడంతోనే తాను వేగంగా కోలుకుని, సాధారణ స్థితికి చేరానని ఆస్పత్రి డాక్టర్లకు మహిళ కృతజ్ఞతలు తెలిపింది.