సూడాన్ చిన్నారికి కిమ్స్ ఆసుపత్రిలో సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్స
ఆ బాబుది ఎక్కడో ఉత్తర ఆఫ్రికా ఖండంలోని సూడాన్ దేశం. వయసు కేవలం రెండు నెలలు. కానీ, ఊపిరి సరిగా అందకపోవడం, పాలు తాగలేకపోవడం, ఒళ్లంతా నీలంగా మారిపోతుండటం, బరువు కూడా 2.8 కిలోల నుంచి ఇక పెరగలేకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఆ చిన్నారిని హైదరాబాద్‌కు తీసుకురాగా.. కిమ్స్ ఆసుపత్రిలోని పిల్లల గుండె శస్త్రచికిత్స నిపుణులు అత్యంత సంక్లిష్టమైన, చాలా పెద్ద ఆపరేషన్ చేసి, పాపకు ప్రాణదానం చేశారు. బాబును తీసుకొచ్చినప్పుడు అతడికి వైద్యపరీక్షలు చేయగా.. టౌసింగ్ బింగ్ ఎనామలీ అనే సంక్లిష్టమైన గుండె వ్యాధి ఉన్నట్లు తేలింది. ఈ సమస్య ఉన్నవారికి గుండె నుంచి వచ్చే రెండు ప్రధాన వాల్వులు తిరగబడి ఉండటంతో పాటు.. గుండెలోని రెండు దిగువ గదుల మధ్య పెద్ద రంధ్రం (వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ / వీఎస్డీ) ఉంటుంది. దీనికి తోడు గుండె నుంచి శరీరం మొత్తానికి రక్తాన్ని తీసుకెళ్లే బృహద్ధమని చాలా చిన్నగా ఉంది, దాంతోపాటు.. కోఆర్క్టేషన్ అనే మరో తీవ్రమైన సంకోచం సైతం ఉంది. ఇన్ని రకాల గుండె సమస్యలు ఉండటం చాలా అరుదు. అందులోనూ పుట్టుకతో గుండె సమస్య ఉన్నవారికి ఇన్ని ఇబ్బందులుండవు. ఈ సమస్య వల్ల గుండె నుంచి శరీరభాగాలకు వెళ్లాల్సిన రక్తం కాస్తా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. వీటన్నింటితో పాటు ఇంకా.. మరో అతిపెద్ద సమస్య కూడా వచ్చింది. అది లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఔట్‌ఫ్లో ట్రాక్ట్ అబ్‌స్ట్రక్షన్ (ఎల్‌వోటో). గుండెలోని ఎడమవైపు ఉండే వాల్వు (మైట్రల్ వాల్వు) నుంచి అదనపు కణజాలం రావడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ కణజాలం ఎడమవైపు జఠరిక నుంచి రక్తం బయటకు వచ్చే మార్గంలోకి చొచ్చుకెళ్తుంది. దానివల్ల రక్తం బృహద్ధమని నుంచి శరీరంలోకి వెళ్లడానికి అడ్డంకులు తలెత్తాయి.
ఈ చిన్నారిని సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ ధర్మపురం చూశారు. దాదాపు పది గంటల పాటు సంక్లిష్టమైన ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని నిర్ణయించారు. చికిత్స తీరును ఆయన ఇలా వివరించారు. “ఇందులో గుండెనుంచి బయటకు వచ్చే కవాటాల అమరికను సరిచేయడానికి ఆర్టీరియల్ స్విచ్ ప్రక్రియను చేయాల్సి వచ్చింది. దాంతోపాటు గుండె దిగువ గదుల పైభాగంలో వీఎస్డీ ఉంది. దాన్ని పెద్ద ప్యాచ్ సామాగ్రితో మూసి ఎడమ జఠరికలోని రక్తాన్ని బృహద్ధమనిలోకి పంపాము. ఆ తర్వాత ఎల్‌వీఓటీలో అవరోధం కలిగిస్తున్న అసాధారణ కణజాలాన్ని తొలగించడం శస్త్రచికిత్సలో అత్యంత సంక్లిష్టమైన భాగం. దాన్ని యాక్సెసరీ మైట్రల్ వాల్వ్ టిష్యూ అంటారు. దీన్ని తొలగించడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే, దానికి.. మైట్రల్ వాల్వుకు మధ్య ఉన్న సంబంధాలన్నీ మైట్రల్ వాల్వులో భాగమే అనిపిస్తాయి. అందువల్ల సరిగ్గా ఏ భాగం తీయాలో, దేన్ని ఉంచాలో నిర్ణయించుకోవడం శస్త్రచికిత్స చేసేవాళ్లకు కత్తిమీద సామే. కొద్ది మిల్లీమీటర్ల తేడా జరిగినా మైట్రల్ వాల్వు దెబ్బతిని ఆపరేషన్ సమయంలోనే పాప మరణించే ప్రమాదం ఉంటుంది. చంటి పిల్లలకు గుండె శస్త్రచికిత్సలలో ఇలాంటివి అత్యంత కష్టం, సమస్యాత్మకమైనవి, సవాళ్లతో కూడుకున్నవి” అని ఆయన తెలిపారు.
శస్త్రచికిత్స తర్వాత బాబును ఐసీయూకు తరలించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత బాబు ఎంచక్కా తల్లి ఒడిలో ఆడుకుంటూ, తల్లిపాలు తాగుతూ, సాధారణంగా శ్వాస పీల్చుకుంటోంది. గుండె ఎలాంటి సమస్యలు లేకుండా బాగా పనిచేస్తున్నట్లు తర్వాత చేసిన వైద్య పరీక్షలలో తేలింది. ఇంత పెద్ద, సంక్లిష్టమైన శస్త్రచికిత్స తర్వాత బాబు బాగా ఆడుకోవడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషించి, కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో తమ దేశానికి వెళ్లనున్నట్లు చెప్పారు.