తొలిదశలో గుర్తిస్తే క్యాన్సర్ ను జయించొచ్చు


◆ ఆరోగ్యకర జీవన విధానంతో క్యాన్సర్ నుండి రక్షణ
◆ “నేను-నేను సాధించగలను” నినాదంతో క్యాన్సర్ వ్యాధిపై పోరాటం
◆ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ ప్రత్యేక కార్యక్రమాలు
◆ ప్రముఖ హెమటో ఆంకాలజిస్టు డాక్టర్ రంజిత్ కుమార్

తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా క్యాన్సర్ వ్యాధిని సులువుగా జయించవచ్చని, క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా క్యాన్సర్ బారినపడుతున్న లక్షలాది మందిని ప్రాణాపాయం నుండి రక్షించవచ్చని ప్రముఖ హెమటో ఆంకాలజిస్టు డాక్టర్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నందు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అనేక అపోహలున్నాయని అన్నారు. క్యాన్సర్ వ్యాధి హఠాత్తుగా ప్రాణాన్ని కబళిస్తుందని, క్యాన్సర్ సోకితే మరణం తథ్యమని, క్యాన్సర్ వ్యాధికి చికిత్స లేదని, క్యాన్సర్ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకుతుందని.. ఇలా క్యాన్సర్ వ్యాధి పట్ల ఎన్నో అపోహలు సమాజంలో పాతుకుపోయాయని అన్నారు. క్యాన్సర్ బారినపడితే జీవితం అస్తవ్యస్తంగా మారుతుందనేది కాదనలేని వాస్తవం అయినప్పటికీ, క్యాన్సర్ వ్యాధి సోకడంతోనే జీవితం ముగిసిపోయినట్లు ఎంతమాత్రం కాదని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఏ విధమైన క్యాన్సర్..? వ్యాధి ఏ దశలో ఉంది..? అనే అంశాలపై రోగి పరిస్థితి ఆధారపడివుంటుందని, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధిపై విజయం సాధించవచ్చని తెలిపారు. వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చని వివరించారు. 20వ వార్షిక ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రంజిత్ కుమార్ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో నిమిషానికి సగటున 17 మంది క్యాన్సర్ వ్యాధికి బలవుతున్నారని, మొత్తం క్యాన్సర్ మరణాల్లో ఆరు శాతం మంది భారతీయులేనని చెప్పారు. గతంలో ప్రతి ఐదుగురు క్యాన్సర్ రోగుల్లో ఒకరు భారతీయుడుగా ఉండగా, ప్రస్తుతం ప్రతి నలుగురు క్యాన్సర్ రోగుల్లో ఒకరు మనదేశానికి చెందినవారుగా ఉండటం ఆందోళకరమైన విషయమని అన్నారు. ఈ ఏడాది క్యాన్సర్ డేను ‘నేను-నేను సాధించగలను’ అనే నినాదంతో జరుపుకుంటున్నామని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ సంఘటితం చేసి క్యాన్సర్ వ్యాధిపై దృఢమైన పోరాటం చేసేందుకు ఈ శక్తివంతమైన నినాదం స్ఫూర్తినిస్తుందని అన్నారు. క్యాన్సర్ పై పోరాటాన్ని ప్రతిఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలని, సమాజంపై క్యాన్సర్ వ్యాధి ప్రభావాన్ని తగ్గించడంలో ప్రతి ఒక్కరూ తమదైన పాత్రను పోషించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంభించడం ద్వారా క్యాన్సర్ బారినపడిన ప్రతిఒక్కరూ జాగ్రత్త వహించాలని, ఆహారంలో పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్ కలిగిన ఆహార పదార్థాలను భుజించడం, తగినంత శారీరక శ్రమ, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా సగానికి సగం క్యాన్సర్ల బారినపడకుండా రక్షణ లభిస్తుందని అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ వ్యాధి పట్ల సమాజంలో అవగాహన పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని, తొలిదశలోనే వ్యాధిని గుర్తించి, చికిత్స తీసుకునేలా చైతన్యం తీసుకొస్తే క్యాన్సర్ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని డాక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు.