సందేశాత్మక క్యాలెండర్ ను ఆవిష్కరించిన పరుచూరి గోపాలకృష్ణ
వందలాది సినిమాలకు ఎన్నో విజయవంతమైన కథలు అందించిన తాను గత కొన్నేళ్లుగా ప్రముఖ రచయిత కొత్త శ్రీనివాస్ గారి సందేశాత్మక సూక్తులకు అభిమానిని ప్రముఖ రచయిత డా. పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. ఆదివారం రచయిత కొత్త శ్రీనివాస్ రచించి రూపొందించిన సందేశాత్మక క్యాలెండర్‌ను డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, ప్రముఖ దర్శకులు శ్రీ బి.గోపాల్‌గారు, శ్రీ ఎస్‌వి కృష్ణారెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. సమాజంలో అందరికీ క్యాలెండర్ అనగానే వారాలు, తిథులు, వర్జ్యాలు మాత్రమే గుర్తుకు వస్తాయని కానీ, వాటికోసమే క్యాలెండర్లు వెతుకుతామని, కానీ క్యాలెండర్ అంటే జీవితపాఠాలు నేర్చుకునే ముత్యాల్లాంటి సూక్తులు రూపొందించి రచయిత కొత్త శ్రీనివాస్ క్యాలెండర్‌కే కొత్త నిర్వచనమిచ్చారన్నారు. తాను ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే ఎన్టీఆర్ ఫొటోకు దండం పెట్టుకుంటానని ఆ వెంటనే శ్రీనివాస్ రూపొందించిన క్యాలెండర్‌లో ఆరోజు సూక్తిని చదువుతానని చెప్పారు. గత మూడేళ్లుగా ఇదే తన దినచర్యగా మారిందని ఆయన చెప్పారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి హృదయం ఇంత గొప్ప సందేశాత్మకసూక్తులను సమాజానికి అందించడం ఎంతో ఆనందాన్నిస్తుందని ఆయన ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను ప్రశంసించారు. సమాజం నుంచి అక్షరం పుట్టిందని.. అనంతరం ఆ అక్షరమే సమాజాన్ని నడిపిస్తుందని తెలిపారు. ఇంత అందమైన అక్షరాలతో గత కొన్నేళ్లుగా కొత్త శ్రీనివాస్ ఎంతో అభిమానులను మార్చుకున్నారు. అనంతరం ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏ వయస్సు వారికైనా కొత్త శ్రీనివాస్ కొటేషన్స్ ఉపయోగపడుతాయని చెప్పారు. శ్రీనివాస్ అక్షరాలు చదివితే ఆయనకు అభిమానులు కావాల్సిందేనని కృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం రచయిత కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ మానవీయ సంబంధాల వారధి ఒక మంచి మాట ఒక పలకరింపు మాత్రమేనని, మనుషులకు మాత్రమే ఉన్న వరాలు ఇవి అని చెప్పారు. దాదాపు ఏడాదిగా కరోనా వల్ల అస్తవ్యస్తమైన ప్రపంచగమనం సరైన దారిలో మళ్ళాలని, ఆరోగ్యవంతమైన జీవితం అందరికీ చేకూరాలని ఆకాంక్షించారు. క్యాలెండర్ ను అందరి వలె సాధారణంగా కాకుండా పూర్తిగా వినూత్నమైన ఆలోచనలు జోడించి జీవితానుభావాలతో రచించిన సూక్తులతో ప్రతిరోజూ ఉదయం లేవగానే ప్రేరణను అందించే విధంగా రూపొందించామన్నారు. ప్రతి విషయం పట్ల సమాజంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు సానుకూల దృక్పథం పెంపొందించుకునే విధంగా క్యాలెండర్‌లో పలు అంశాలను పొందుపరిచినట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కొత్త శ్రీనివాస్ తెలిపారు. ప్రతి యేటా తనకు అత్యంత శ్రేయోభిలాషులు, స్నేహితుల మధ్య సినీరంగ పెద్దలు, ప్రముఖ హీరోలు ఆవిష్కరించినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ సంవత్సరం కరోనా సంక్షోభం నేపథ్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ ఆలస్యమైనట్లు కొత్త శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ శ్రీ కె. విద్యాధర్, కొత్త శ్రీనివాస్ గారి శ్రీమతి, సామాజిక వేత్త డాక్టర్ కొత్త కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.