తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ? కొత్త పార్టీనా?

తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ పార్టీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆమె వైఎస్ఆర్ వారసురాలిగా ప్రవేశం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, టీజేఎస్, జనసేన ఉండగా కొత్తగా మరో పార్టీ పుట్టుకురానున్నది.

జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కూడా ఉన్నా. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత వరుసగా రెండోసారి టీఆర్ఎస్ అధికారంలో వచ్చింది. వైసీపీకి టీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం షర్మిల ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించనున్నది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో షర్మిల ఎంట్రీ ఇవ్వనున్నట్లు వస్తున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉండడం ప్రత్యేక పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. వైఎస్ఆర్ పేరు వచ్చేలా కొత్త పార్టీ ని సిద్దం చేస్తున్నారని, పార్టీ జెండా రూపుదిద్దుకుంటున్నదని చర్చ మొదలైంది. షర్మిల రాకతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారనున్నాయి. వైఎస్ఆర్ అభిమానులు ఆమెను చేరదీస్తారని సీనియర్ నాయకులు అంటున్నారు. పార్టీ స్వతంత్రంగానే వ్యవహరిస్తుందా, ఏదైనా పార్టీతో పొత్తులకు వెళ్తుందా అనేది మున్ముందు వెల్లడి కానున్నది. త్వరలోనే పార్టీ నూతన పార్టీ విధివిధానాలపై ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి