రెండేళ్ల ఫిలిపిన్స్ పాపకు కిమ్స్ లో విజయవంతగా కాలేయ మార్పిడి
ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన రెండేళ్ల పాపకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో విజయవంతంగా కాలేయమార్పిడి శస్త్రచికిత్స చేశారు. 9.5 కిలోల బరువున్న ఆ పాపకు.. ఆమె తండ్రే కాలేయదానం చేశారు. ఆ చిన్నారి బైలియరీ ఆట్రీషియా అనే సమస్యతో బాధపడుతోంది. దీనివల్ల పుట్టుకతోనే పిత్తనాళాలు మూసుకుపోతాయి. దానివల్ల కామెర్ల వ్యాధి సంభవిస్తుంది. సమస్యను త్వరగా గుర్తిస్తే కసాయ్ ప్రొసీజర్ (దాన్ని కనిపెట్టిన వైద్యుడి పేరుమీద వచ్చింది) లేదా ప్రోటోఎంటిరోస్టమీ అనే శస్త్రచికిత్సలు చేసి నయం చేయొచ్చు. అయితే మూడు నెలల తర్వాత లేదా అంతకంటే ఆలస్యంగా గుర్తిస్తే మాత్రం కాలేయం పాడవుతుంది. (సిరోసిస్ – జలోదరం ఏర్పడుతుంది). అప్పుడు కసాయ్ ప్రొసీజర్ పనికిరాదు. అయితే, కొంతమంది పిల్లల్లో త్వరగా గుర్తించి, కసాయ్ ప్రొసీజర్ చేసినా కూడా అది విఫలమై, సమస్య పునరావృతం అయితే కాలేయమార్పిడి తప్పక చేయించాల్సి వస్తుంది. పిల్లలకు చేసే అవయవ మార్పిళ్లలో 50% బైలియరీ ఆట్రీషియా సమస్యవే ఉంటాయి.
తమ పాపకు మూడు నెలల వయసుండగా ఫిలిప్పీన్స్ దేశంలోనే కసాయ్ ప్రొసీజర్ చేయించామని, 18 నెలల వయసు వచ్చేవరకు బాగానే ఉన్నా తర్వాత ఆమెకు కామెర్లు వచ్చాయని పాప తండ్రి చెప్పారు. ఆరోగ్య పరీక్షలు చేయించగా, లివర్ సిరోసిస్ వచ్చినట్లు తేలిందని.. దాంతో కాలేయమార్పిడి చేయించాల్సిందిగా వైద్యులు సూచించారని తెలిపారు.
దాంతో ఆ కుటుంబం తమ పాపకు కాలేయమార్పిడి చేయించడానికి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చింది. తల్లికి అప్పటికే అనారోగ్యం ఉండటం వల్ల ఆమె కాలేయదానానికి ముందుకు రాలేదు. తండ్రి ముందుకొచ్చినా, అతడికి కొలెస్టరాల్ ఎక్కువ ఉండటంతో పాటు.. ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఉంది. దాంతో ముందుగా అతడికి తగిన ఆహారం, వ్యాయామాలు, మందులు ఇచ్చారు. అతడు 8 కిలోల బరువు తగ్గడంతో పాటు కొలెస్టరాల్ స్థాయి సైతం గణనీయంగా మెరుగైంది. అయితే, సరిగ్గా కాలేయమార్పిడి శస్త్రచికిత్సకు తీసుకెళ్లే సమయానికి పాప బైలురూబిన్ పెరిగి సాధారణ స్థాయికంటే 35 రెట్లు ఎక్కువ (35 ఎంజీ/డీఎల్) ఉంది. అయినా కిమ్స్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తిచేశారు.
ఇప్పుడు పాప, ఆమె తండ్రి ఇద్దరూ కోలుకుంటున్నారు. పాపను ఇంకా వార్డులో ఉంచగా, తండ్రిని ఇప్పటికే డిశ్చార్జి చేశారు. పాప కాలేయం పనితీరు మెరుగుపడి బైలురూబిన్ 3 ఎంజీ/డీఎల్ స్థాయికి వచ్చింది. ఆమె సాధారణంగా ఆహారం తీసుకుంటూ, చురుగ్గా ఆడుకుంటోంది.
కన్సల్టెంట్ చీఫ్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ హెచ్‌పీబీ సర్జరీ డాక్టర్ రవిచంద్ సిద్దాచారి, కన్సల్టెంట్ హెపటోబైలియరీ – పాంక్రియాటిక్ (హెచ్‌పీబీ), జీఐ మరియు కాలేయ, పాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ చావా శ్రీనివాస ప్రభుల నేతృత్వంలో శస్త్రచికిత్స చేశారు. కన్సల్టెంట్ అనెస్థీషియాలజిస్టులు డాక్టర్ నందకిషోర్, డాక్టర్ ప్రవీణ్, ఐసీయూలో కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్టు డాక్టర్ నందకిషోర్, ఆయన బృందం, కన్సల్టెంట్ రేడియాలజిస్టు డాక్టర్ అంబర్ తదితరులు కూడా తమవంతు సేవలు అందించారు.