కులి కుతుబ్‌షా సమాధులు,  గోల్కొండ ఖిల్లా ప్రాంతాల్లో  పర్యటించిన జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్

హైద‌రాబాద్‌లోని ప్రముఖ చారిత్రక ప్రాంతాలైన కులి కుతుబ్‌షా సమాధులు, గోల్కొండ ఖిల్లా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, కటోరా హౌస్, శాతమ్‌త‌లాబ్‌ల‌ అభివృద్ధి తదితర కార్యక్రమాలను దానకిషోర్ నేడు ఉదయం తనిఖీ చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించిన దానకిషోర్ బంజారా దర్వాజా ప్రారంభంలో ఇరువైపులా ఉన్న నాలాకు మెష్‌ను నిర్మించి చెత్తను వేయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క‌ఠోర హౌస్‌లో జీహెచ్ఎంసీ, టూరిజం కార్పొరేషన్ ద్వారా పడుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు అనంతరం శాతమ్‌తలాబ్ చెరువును సందర్శించారు. ఈ చెరువు మార్గంలో కోట చుట్టూ పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశించారు. గోల్కొండ కోట‌ను ప్ర‌తిరోజు దేశ విదేశాల‌కు చెందిన వంద‌లాది మంది ప‌ర్యాట‌కులు సంద‌ర్శిస్తున్నందున పారిశుధ్య‌ కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు.