సన్న వడ్లకు ఇక సున్నమే
తెలంగాణ పాలకుల నిర్లక్ష్యం.. అన్నదాతల పాలిట శాపంగా మారింది. రైతును రాజును చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా వానాకాలం సీజన్ నుంచి నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రవేశపెట్టింది. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తేనే.. మంచి మద్దతు ధరను పొందగలమంటూ సీఎం కేసీఆర్ రైతులకు హామీనిచ్చారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ నియంత్రిత పంటలను సాగు చేయాలని చెప్పడంతో రైతులంతా అదే పనిచేశారు. అదే మాటను క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ఢంకా బజాయించి చెప్పింది. అందులో భాగంగానే దొడ్డు రకం, సన్న రకాలను 60:40 నిష్పత్తిలో సీఎం కేసీఆర్ చెప్పినట్టు సాగు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నియంత్రిత పంటల సాగులో అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే.. దొడ్డు రకం వరి పంట సాగుతో పోల్చితే.. సన్నరకం వరి పంటకు పెట్టు బడి అధికం. దిగుబడి సైతం దొడ్డు రకం వరి ధాన్యం కంటే తక్కువగానే వస్తోంది. అయితే సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో ఇటు ప్రభుత్వం.. అటు అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. చివరకు సన్న రకం ధాన్యం కొనేందుకు సైతం మిల్లర్లు ఆసక్తి చూపకపోవడంతో అన్నదాతలకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ ధరలు కూడా విస్మయానికి గురి చేస్తోంది.