భారత్‌కు ఒలింపిక్‌ కమిటీ షాక్‌

ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్‌ షూటర్లకు భారత ప్రభుత్వం వీసాలు నిరాకరించడంపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంతో భవిష్యత్‌లో అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై భారత్‌తో చర్చలను నిలిపివేయాలని ఐఓసీ నిర్ణయించింది. దీంతో పాటు దిల్లీలో జరిగే ప్రపంచకప్‌ పోటీల నుంచి పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్‌ ఈవెంట్‌కు ఒలింపిక్‌ అర్హత హోదాను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

ఒలింపిక్‌ ఛార్టర్‌ విధివిధానాలకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ప్రవర్తించిందని ఐఓసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో అన్ని దేశాల అథ్లెట్లను, క్రీడా ప్రతినిధులను సమానంగా చూడాలని ఒలింపిక్‌ కమిటీ సూచించింది. అథ్లెట్ల మధ్య ఆతిథ్య దేశం ఎలాంటి వివక్ష చూపించకూడదని, ఆ దేశ రాజకీయ జోక్యం కూడా ఉండరాదని పేర్కొంది. భారత్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్లే ఆ దేశంతో చర్చలు నిలిపివేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. ఇకపై ఒలింపిక్‌ ఛార్టర్‌ నిబంధనలకు అనుగుణంగా విదేశీ పోటీదారులకు అనుమతి కల్పిస్తామని భారత ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వచ్చేంతవరకు ఒలింపిక్‌ సంబంధింత పోటీలు నిర్వహించేందుకు ఆ దేశానికి అనుమతి ఇవ్వబోమని ఒలింపిక్‌ కమిటీ స్పష్టం చేసింది.

శుక్రవారం నుంచి దిల్లీలో షూటింగ్‌ ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. అయితే ఇటీవల జరిగిన పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ షూటర్లకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. ఇదిలా ఉండగా.. భారత నిర్ణయంతో ప్రపంచకప్‌లో అందుబాటులో ఉన్న 16 ఒలింపిక్‌ (2020, టోక్యో) అర్హత స్థానాలను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్‌ స్పోర్ట్స్‌ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) గురువారం ప్రకటించింది.