టౌన్‌ప్లానింగ్ నిబంధనలపై 23న అవగాహన సదస్సు
గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా ఇల్లు నిర్మించనున్నారా, ఫ్లాట్‌ను కొనుగోలు చేయనున్నారా, ఎంత భూ వైశాల్యంలో ఎన్ని అంతస్తుల భవనం నిర్మించవచ్చు తదితర అంశాలపై నగరవాసుల సందేహాలను తీర్చేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ అవగాహన సదస్సులో కొత్తగా ఇల్లు నిర్మించేవారు భవన నిర్మాణ అనుమతికి ఏవిధమైన డాక్యుమెంట్లను సమర్పించాలి, ఇంటి నిర్మాణానికి ఎంత మేర సెట్ బ్యాక్‌లు వదలాలి, ఫ్లాట్ కొనుగోలు సందర్భంగా జీహెచ్ఎంసీ నిర్దేశించిన నిబంధనలు ఏవిధంగా ఉండాలి, ఎన్ని గజాలు లేదా మీటర్ల విస్తీర్ణంలో ఎన్ని అంతస్తుల భవనాలు నిర్మించే అవకాశం ఉంది తదితర వివరాలన్నింటిని ఈ టౌన్‌ప్లానింగ్ అవగాహన సదస్సులో వివరించనున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ వెల్లడించారు. ఫిబ్రవరి 23వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 500 గజాల లోపు స్థలం లో ఇల్లు నిర్మిoచదలుచుకున్న వారు, 2000 చదరపు అడుగులలోపు ఫ్లాట్ కొనుగోలు చేసే వారు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరు కావాలని కమీషనర్ స్పష్టం చేశారు. ఈ సదస్సులో 500 భవన నిర్మాణ ప్లాన్ లు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం వివిధ కేటగిరిలకు సంబంధించిన 16,000 భవన నిర్మాణ అనుమతు లు జీహెచ్ఎంసీ జారీ చేస్తోంది. వీటిలో దాదాపు 13వేల దరఖాస్తులు ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణ అనుమతులకు అందుతున్నాయి. ఇప్పటికే డి.పి.ఎం.ఎస్ విధానం ద్వారా భవన నిర్మాణ అనుమతులన్నింటిని ఆన్‌లైన్‌లో జారీచేయడం ద్వారా టౌన్‌ప్లానింగ్ విభాగంలో పారదర్శకతను తెచ్చినప్పటికీ నిర్మాణ అనుమతులకు అందజేసే దరఖాస్తులు అవగాహన లోపం, నియమ నిబంధనలను తెలియజేసే వ్యవస్థ లేకపోవడంతో దాదాపు 10శాతానికి పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగడం, మధ్యవర్తులు, బ్రోకర్లను ఆశ్రయించడం తద్వారా అక్రమ నిర్మాణాలకు కారణమవుతున్నాయి. దీంతో టౌన్‌ప్లానింగ్ విభాగం పై తరచుగా ప్రతికూల వార్తలు రావడంతో జీహెచ్ఎంసీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఈ నేపథ్యంలో టౌన్‌ప్లానింగ్ నియమ నిబంధనలపై ఇక నుండి అవగాహన సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 23న మొదటి సారిగా నిర్వహించే ఈ అవగాహన సదస్సులో భవన నిర్మాణ అనుమతులకు పాటించాల్సిన నియమ నిబంధనలు, జతపర్చాల్సిన డాక్యుమెంట్లు, ఫ్లాట్లు, ఇల్లు కొనుగోలుచేసేందుకు పరిగణలో తీసుకోవాల్సిన నిబంధనలు, ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తుల భవనం నిర్మించుకోవచ్చు తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. అనంతరం పలు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసి టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణాలు చేయాలనుకునేవారు తమ స్థల వైశాల్యం, ఎన్ని అంతస్తులు నిర్మించే విషయం, సమర్పించే డాక్యుమెంట్లు తదితర అంశాలకు సంబంధించి ఆసక్తి పత్రాన్ని ఈ అవగాహన సదస్సులో అందజేస్తే వారికి నియమిత సమయంలోగా తగు సూచనలతో కూడిన మార్గదర్శకాలు అందజేయనున్నట్టు దానకిషోర్ తెలిపారు. 23న ఉదయం 10 గంటలకు ఈ అవగాహన సదస్సును మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభిస్తారని కమిషనర్ తెలిపారు. ఈ సదస్సు కు సంబంధించి మరిన్ని వివరాలను 040 23220438 లేదా 7993360230 అనే నెంబర్లకు కాల్ చేయాలని పేర్కొన్నారు.