జీకాట్` సూచనలు ముందుకు తీసుకువెళ్తాం:పోచారం

డెక్క‌న్ న్యూస్‌, హైద‌రాబాద్‌ : మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 150వ గాంధీ జయంతి ఉత్సవం సదస్సును గ్రామోదయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ (జీకాట్‌) ఘనంగా నిర్వహిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంపై గాంధేయ మార్గం, గాంధీగారి ఆలోచనల ప్రాముఖ్యత అన్న అంశంపై అక్టోబరు1 నుంచి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఈ సదస్సు రెండో రోజు విజయవంతంగా కొనసాగింది.    అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయుల చిత్రపటాలకు జీకాట్ సభ్యులు పూలమాలలు వేసి వారికి ఘన నివాళులర్పించారు. ఆ మహనీయుల సేవలను జీకాట్ సభ్యులు స్మరించుకుంటూ రెండో రోజు సదస్సును ప్రారంభించారు. రెండో రోజు సదస్సులో మధ్యప్రదేశ్ సైన్స్ & టెక్నాలజీ, ఎంఎస్ఎంఈ శాఖా మంత్రి ఓం ప్రకాష్ సక్లేచ, తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద రెడ్డి, సాక్షి జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ దిలీప్ రెడ్డి, జీకాట్ ఫౌండర్ ఢిల్లీ వసంత్, ఉత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ బీ ప్రతాప్ రెడ్డి, జీకాట్ చైర్మన్ మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి, జీకాట్ సీఈవో శ్రవణ్, జీకాట్ ప్రతినిధులు పలువురు ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న జీకాట్ సంస్థ సలహాలు, సూచనలు స్వీకరించి వాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పల్లెల్లో పేదరికం ఉండకూడదని, రైతులు ఆనందంగా ఉండాలని జీకాట్ స్థాపించారని, గ్రామాల్లో జీకాట్ చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందిస్తామని పోచారం అన్నారు. గ్రామాలను అధ్యయనం చేయడానికి జీకాట్ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారని, తమ రాష్ట్రంలోని గ్రామాలను కూడా జీకాట్ బృందం సందర్శించాలని మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి సక్లేచ ఆహ్వానించారు. గ్రామాల అనుసంధానంతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర భారత్, వోకల్ ఫర్ లోకల్ కాన్సెస్ట్ కు జీకాట్ గ్రామాల అధ్యయనం కాన్సెప్ట్ దగ్గరగా ఉందని అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రవేశపెట్టిన గ్రామోదయ అభ్యుదయ పురస్కారానికి తనను ఎంపిక చేయడం ఎంతో గర్వంగా ఉందని నాబార్డ్ చైర్మన్ చింతల గోవింద రాజులు అన్నారు. ఇలాంటి తరుణంలో గ్రామాల అధ్యయనం కోసం మోడల్ విలేజ్ కాన్సెప్ట్ ను సాంకేతిక మాధ్యమంగా ఎంచుకొని ఒక సంకల్పాన్ని దేశం ముందు ప్రవేశపెట్టినందుకు జీకాట్ బృందంలోని సభ్యులందరికీ, ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని గోవిందరాజులు అన్నారు.     
మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి సేవలను పోచారం స్మరించుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద, గొప్ప ప్రజాస్వామ్య దేశం మనదని, ఉద్యమ నాయకులు, ప్రజలతో కలిసి బ్రిటిషు వారితో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని పోచారం అన్నారు.   రైతులు అప్పుల కోసం కాకుండా, డబ్బులు దాచుకునేందుకు బ్యాంకులకు వెళ్లాలన్నది సీఎం కేసీఆర్ గారి ఆలోచన అని అన్నారు. వ్యవసాయ రంగం పటిష్టంగా ఉండే అన్ని రంగాలు పటిష్టంగా ఉంటాయని, ఈ దిశగా తెలంగాణ సర్కార్ గత ఆరు సంవత్సరాలుగా నిర్విరామ కృషి చేస్తోందని చెప్పారు. తాను వ్యవసాయ మంత్రిగా పనిచేశానని, వ్యవసాయ రంగం బలోపేతానికి, రైతాంగం సంక్షేమానికి తన వంతు కృషి చేశానని అన్నారు. రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొంటున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. రైతు ఆత్మహత్యలు తగ్గాయని, ఇంకా తగ్గాల్సి ఉందని అన్నారు. దాదాపుగా తెలంగాణలోని ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరందించామని, అందువల్ల అంటురోగాలు, సీజనల్ జ్వరాలు తగ్గాయని అన్నారు. తెలంగాణ సర్కార్ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమని అన్నారు.  
గాంధీ గారి కలలను పూర్తి చేసే బాధ్యత అందరిపై ఉందని, ప్రత్యేకంగా పాలకులపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పాలకుల విధానాల వల్ల దేశ రూపురేఖలు మారతాయని, కొద్దిమంది కోసమే స్వాతంత్ర్యం రాలేదని అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు స్వాతంత్ర్య ఫలాలు పొందిన నాడే గాంధీగారి కల సాకారమవుతుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన దేశంలో ప్రధానులు, ముఖ్యమంత్రులు మారుతున్నారని, పేదవారికి, ధనికులకు మధ్య అంతరం తగ్గితేనే స్వాతంత్ర్య ఫలాలు అందరకీ అందినట్లని అభిప్రాయపడ్డారు. పేద, ధనిక, పల్లె, పట్టణం అని తేడా లేకుండా ప్రజల కనీస అవసరాలు ప్రభుత్వం తీర్చాలని, పాలనలో కొంత మార్పు రావాలని అన్నారు. మన దేశంలో పుష్కలంగా వనరులున్నా చాలామంది పేదలకు ఇల్లు, మూడు పూటలా తిండి లేదని, ఈ పరిస్థితి మారాలని అన్నారు.
దేశానికి వ్యవసాయం, పరిశ్రమ రంగాలు కీలకమైనవని, గ్రామీణ జనాభాలో 70 శాతం రైతులేనని, వారి అవసరాలు గుర్తించాలని అన్నారు. దేశానికి రైతే రాజు అన్న మాటను అమలు చేయాలని, అపుడే దేశం, రైతులు బాగుపడి రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని అన్నారు. 130 కోట్ల  దేశ జనాభాలో 90 కోట్లమంది రైతులేనని, అప్పులు లేకుండా ఎంతమంది రైతులు పంటలు పండిస్తున్నారని, ఎంతమంది రైతులు సంతోషంగా కంటినిండా నిద్రపోతున్నారని పోచారం ప్రశ్నించారు. రైతుల ఘోష వర్ణనాతీతం అని, రైతులు సుఖంగా ఉంటే దేశంలోని 70 శాతం ప్రజలు సుఖంగా ఉన్నట్లేనని చెప్పారు. గ్రామాలలోని పొలాలకు సాగునీరు, ఉచిత విద్యుత్, సకాలంలో విత్తనాలు, పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర వంటివి అందించినపుడే రైతులు ఆర్థికంగా బలపడతారని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలలోనూ మార్గాలు చూపిన నాడే విదేశాలకు, పొరుగు రాష్ట్రాలకు వలసలు తగ్గుతాయని చెప్పారు. వలస వెళ్లేవారిలో చాలామంది గ్రామీణ ప్రాంత బిడ్డలేనని, వారిలో చాలామందికి పొలాలున్నా వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో వలస వెళ్లారని అన్నారు. ఈ పద్ధతి మారి రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ కావాలని, గ్రామీణ ప్రాంత వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెంచాలని, డ్యామ్ లు, చెక్ డ్యామ్ లు కట్టి..ప్రతి ఎకరాకు నీరుపారిస్తే ప్రపంచానికే ఆహారం అందించగల సత్తా మనదేశ రైతులకుందని, మనం ఆహార పదార్ధాలు దిగుమతి చేసుకొనే అవసరం ఉండదని అన్నారు.
సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా తీసుకెలితేనే గాంధీ ఆశయాలు నెరవేరుతాయన్నారు. పవిత్రమైన శాసన సభ ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాలని, దూషణలకు వేదిక కాకూడదని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించాలని, విమర్శలు, ప్రతి విమర్శలతో సభ సమయం వృథా చేయకూడదని అభిప్రాయపడ్డారు. అహంకారం లేకుంటే అందరూ మిత్రులేనని, మనతోపాటు నియోజకవర్గంలోని ప్రజలంతా బాగుండాలి అనుకోవాలని అన్నారు.జీకాట్ శ్యాం సుందర్ రెడ్డి వంటి వారు రైతుల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారని, పల్లెల్లో పేదరికం ఉండకూడదని, రైతులు ఆనందంగా ఉండాలని జీకాట్ స్థాపించారని,  జీకాట్ లో శ్యాం గారు ఉండడం అభినందనీయమని అన్నారు. గ్రామాల్లో జీకాట్ చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందిస్తామని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి గురించి అభిప్రాయాలు తెలియజేసే అవకాశమిచ్చిన జీకాట్ కు పోచారం ధన్యవాదాలు తెలిపారు
రెండోరోజు సదస్సుకు మధ్యప్రదేశ్ సైన్స్ & టెక్నాలజీ, ఎంఎస్ఎంఈ శాఖా మంత్రి ఓం ప్రకాష్ సక్లేచ హాజరయ్యారు. మహాత్మాగాంధీ జయంతి నాడు ఇంత మంచి కార్యక్రమం చేపట్టి, ఆయన కలలు కన్న గ్రామస్వరాజ్యం గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన జీకాట్ కు సక్లేచ ధన్యవాదాలు తెలిపారు.
గ్రామాల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, రైతుల సంక్షేమం కోసం జీకాట్ ఎంతగానో కృషిచేస్తోందని అన్నారు. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని గాంధీగారు చెప్పారని, కానీ, నేడు గ్రామీణ ప్రాంతాలలో ఆదాయం తగ్గడంతో పట్టణాలకు ప్రజలు వలస వెళుతున్నారని అన్నారు. అయితే, కరోనా వల్ల వారంతా పల్లెలకు తిరిగి వచ్చారని, కరోనాతో ప్రకృతి కూడా మనల్ని వ్యవసాయం వైపు తీసుకువెళ్లాలనుకుంటోందని అభిప్రాయపడ్డారు. కరోనా దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయని, కానీ, వ్యవసాయం రంగం మాత్రం కరోనాతో దెబ్బ తినలేదని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కు ప్రధాని మోడీ పిలుపునిచ్చారని, దానికి అనుగుణంగా జీకాట్ చేపట్టిన గ్రామాల అభివృద్ధి కార్యక్రమం ఉందని అభిప్రాయపడ్డారు.  గ్రామాల అనుసంధానంతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర భారత్, వోకల్ ఫర్ లోకల్ కాన్సెస్ట్ కు జీకాట్ గ్రామాల అధ్యయనం కాన్సెప్ట్ దగ్గరగా ఉందని అభిప్రాయపడ్డారు. 
గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్న ప్రధాని మోడీ గారి ఆలోచనను జీకాట్ ఆచరణలో పెడుతోందన్నారు. చిన్న,మధ్య తరహా పరిశ్రమలు కూడా కరోనా వల్ల దెబ్బతిన్నాయని, ఆ ప్రభావం కూడా గ్రామాలపై పడిందని అన్నారు. 100 గ్రామాలను దత్తత తీసుకోవాలన్న జీకాట్ ఆలోచన ఎంతో గొప్పదని, జీకాట్ చేపట్టిన ఈ బృహత్కార్యానికి మధ్య ప్రదేశ్ ఎంఎస్ఎంఈ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పూర్తి సహకారం అందిస్తాయని సక్లేచ తెలిపారు జీకాట్ తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, జీకాట్ చేపట్టిన కార్యక్రమానికి పూర్తి మద్దతిస్తామని అన్నారు. జీకాట్ సభ్యులు మధ్యప్రదేశ్ లో పర్యటించాలని, వారి  ఆలోచనలను తమతో పంచుకోవాలని సక్లేచ ఆహ్వానించారు. జీకాట్ దత్తత తీసుకున్న గ్రామాల్లో  ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందేవరకు కలిసి కట్టుగా పనిచేద్దామని అన్నారు.