హరీష్ రావు వదిలిన బాణమే కత్తి కార్తీక

దుబ్బాక బైపోల్‌ డేట్ ఫిక్స్ కావ‌డంతో ఒక్క‌సారి రాష్ట్ర‌ రాజ‌కీయం వేడెక్కింది. ఎవ‌రి సంగ‌తి ఎలా ఉన్నా ఈ ఉప‌ ఎన్నికలో గెలుపు అధికార పార్టీకే ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. దీంతో దుబ్బాక‌లో తిరిగి గెలిచి ప‌ట్టు నిలుపు‌కోవాల‌ని తీవ్రంగా శ్ర‌మిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ ఎవ‌రూ ఊహించ‌ని వ్యూహాల‌తో ముందుకు సాగుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా దుబ్బాక బ‌రిలో నిల‌బ‌డిన క‌త్తి కార్తీక.. హ‌‌రీష్‌రావు వ‌దిలిన బాణ‌మేనంటూ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆసక్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆమె వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కూడా చాలామందికి ఇదే అనుమానాన్ని క‌లిగిస్తోంది. దీనికి తోడు కార్తీక‌ బ్యాక్‌గ్రౌండ్ ఆ ప్ర‌చారానికి బ‌లాన్నిచ్చేలా ఉంది.

ఎవ‌రి అండా లేకుండా ఇండిపెండెంట్‌గా దుబ్బాకలో పోటీకి దిగుతున్నానంటూ ప్ర‌క‌టించారు క‌త్తి కార్తీక. కానీ వాస్త‌వానికి ఆమెకు బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌థ్య‌మే ఉంది. మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ పద్మారావుగౌడ్‌కు ఆమె చాలా ద‌గ్గ‌రి బంధువు. గ‌తంలో ఆయ‌న‌ నిర్వహించిన అనేక‌ కార్యక్రమాల్లో కత్తి కార్తీక పాల్గొన్నారు. పైగా ప‌ద్మారావుగౌడ్‌ ఇంట‌ర్వ్యూ అంటే చాలు.. అనేక చానెళ్లు క‌త్తి కార్తీక‌తోనే ఆయ‌న్ను ఇంట‌ర్వ్యూ చేయించేవి. ఈ లెక్క‌న‌ ప‌ద్మారావుగౌడ్‌తో మాట్లాడించి.. క‌త్తి కార్తీను అస‌లు పోటీలోకే రాకుండా చేసుకోవ‌డం టీఆర్ఎస్‌కు చిటికెలో ప‌ని. కానీ అధికార పార్టీ కావాల‌నే ఆలా చేయ‌డం లేద‌న్నది చాలా మంది వాద‌న‌.

ఇక దుబ్బాక ఉప ఎన్నిక అభ్య‌ర్థిగా క‌త్తి కార్తీక ఇటీవ‌ల అనేక‌ యూట్యాబ్ చానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. సాధార‌ణంగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే క్యాండిడేట్స్ ఎవ‌రైనా.. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ త‌మ ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. స‌వాళ్లు విసురుతూ, అవ‌స‌ర‌మైతే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ.. పోటీలో తాము కూడా ఉన్నామంటూ ప్ర‌ధాన‌ ప్ర‌త్య‌ర్థుల‌కు గుర్తు చేస్తుంటారు. కానీ క‌త్తి కార్తీక మాత్రం ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆమె ఇస్తున్న ఏ ఇంట‌ర్వ్యూల్లోనూ అధికార పార్టీని ప‌ల్లెత్తు మాట అన‌డం లేదు. ఒక‌వేళ ఇంట‌ర్వ్యూల్లో అలాంటి ప్ర‌శ్న‌లు వేసినా.. ఎంతో ఆచితూచి స‌మాధానాలిస్తున్నారు. ఇలా ఆమె వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. అనేక మందిలో సందేహాల‌ను క‌లిగిస్తోంది.

బీసీ వ‌ర్గానికి చెందిన ఆమెను.. టీఆర్ఎస్ పార్టీనే స్వ‌యంగా రంగంలోకి దింపింద‌నేది చాలా మంది ఆరోప‌ణ‌. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల్చి.. వాటిని టీఆర్ఎస్ ప్ర‌త్య‌ర్థి పార్టీల ఖాతాల్లోకి వెళ్ల‌కుండా చూసేందుకే హ‌రీష్ రావు ఈ ప్లాన్ అమ‌లు చేస్తున్నార‌ని అనుకుంటున్నారు. దుబ్బాక‌లో బీసీ ఓటర్లు నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా ఉన్నారు. వారి ఓట్ల‌ను చీల్చ‌గ‌లిగితే టీఆర్ఎస్ గెలుపు ఖాయమ‌ని ఆ పార్టీ ఆలోచ‌నగా చాలా మంది విశ్లేషిస్తున్నారు.

ఇదిలా ఉంటే క‌త్తి కార్తీక B DESIGN STUDIOS అనే ఓ ఆర్కిటెక్ సంస్థను స్థాపించి.. గవర్నమెంటు ప్రాజెక్టుల కోసం ప‌నిచేస్తున్న‌ట్టు తెలిసింది. ఓ వైపు ప్రభుత్వంతో క‌లిసి పనిచేస్తూనే.. మ‌రోవైపు అదే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోటీ చేయ‌డం అంటే.. అదంతా ట్రాష్ అంటూ సోష‌ల్ మీడియాలోనూ ఆమెపై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇన్ని ప్ర‌శ్న‌ల‌కు క‌త్తి కార్తీక ఏం స‌మాధానం చెబుతారో మ‌రి!