తిరుమ‌ల మాడ వీధుల‌లో శ్రీవారి ఊరేగింపు

తిరుమలలో ఈ నెలలో జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలను మాడ వీధులలో నిర్వహించాలని తి.తి.దే నిర్ణయించింది. అయితే భక్తులను గ్యాలరీలోకి భౌతికదూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో అనుమతించనున్నారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా గత నెలలో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలను శ్రీవారి ఆలయంలోనే రంగనాయకుల మండపంలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి.

కోవిడ్ వ్యాప్తి తిరుపతిలో క్రమంగా తగ్గుతుండడంతో పాటు శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు సగటున పదహారు వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలను బహిరంగంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. అయితే బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా భక్తులను తిరుమలకు అనుమతించరు. శ్రీవారి దర్శనానికి ఆన్లైన్లో టికెట్ పొందిన భక్తులు మాత్రమే వాహన సేవలను చూసేందుకు భౌతిక దూరం పాటిస్తూ గ్యాలరీలోకి అనుమతిస్తారు. ఈసారి వాహన సేవలు ఉదయం ఎనిమిది గంటలకు, సాయంత్రం ఏడు గంటలకు మొదలవుతాయి.

గతంలో వలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు తక్కువ సంఖ్యలో భక్త బృందాలను అనుమతిస్తారు. పోలీసులను సైతం పరిమితంగానే వినియోగించనున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల వాహన సేవలను భక్తులు ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఈనెల 16 నుంచి 24వ తేదీ మధ్యలో శ్రీవారి దర్శనానికి ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోవడమే ఏకైక మార్గం.