పేగుల్లో ఫంగైని నియంత్రించి, ఆరోగ్యంగా ఉండేందుకు కేలరీల లెక్కే మంచి మార్గం
ప్రజల్లో అల్జీమర్స్ వ్యాధికి, మనం తీసుకునే ఆహారంతో ప్రత్యక్ష సంబంధం ఉందని అమెరికాలో చేసిన కొత్త పరిశోధనలో వెల్లడింది. ఆరోగ్యకరమైన, కేలరీలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే పేగులలో ఫంగైని నియంత్రించి, వయోవృద్ధుల్లో మతిమరుపు వ్యాధి ముప్పు తగ్గుతుందని కూడా అందులో చెప్పారు. సెప్టెంబర్ 21న ప్రపంచ అల్జీమర్స్ డే సందర్భంగా ఈ తీవ్రమైన సమస్యకు పరిష్కారాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
65 ఏళ్లు దాటినవారిలో 15-20% మందికి మైల్డ్ కాగ్నిటివ్ ఇంపెయిర్ మెంట్ (ఎంసీఐ) వస్తోందని, దానివల్ల ఆలోచించే సామర్థ్యం తగ్గుతుందని మతిమరుపు వ్యాధికి సంబంధించిన ప్రపంచ సంస్థ.. అల్జీమర్స్ అసోసియేషన్ తెలిపింది. కీటోజెనిక్ ఆహారం తీసుకుంటే మనుషుల పేగుల్లో ఉండే బ్యాక్టీరియా తగ్గి.. ఎంసీఐతో బాధపడేవారు అల్జీమర్స్ వ్యాధికి గురయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని కొత్త పరిశోధన వెల్లడించింది.
ఈ వ్యాధి గురించి, కొత్త పరిశోధన గురించి మెడికవర్ ఆసుపత్రులకు చెందిన కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రవి కిరణ్ మాట్లాడుతూ, ‘‘మన సంప్రదాయ సమాజంలో మతిమరుపు అనేది సామాజిక, కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతుంది. పనిగంటలు తగ్గుతాయి, ఉద్యోగాలు పోతాయి, సంబంధాలు తెగితపోతాయి, నివాస స్థలం మారడం లేదా జీవించే ఏర్పాట్లు మార్చుకోవడం కూడా జరగొచ్చు! ఇలాంటి సమస్యల వల్ల బాధితులు కుటుంబానికి, సమాజానికి కడా దూరమవుతారు. ఈ సమస్య నివారణకు పరిష్కారాలపై కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కొత్త పరిశోధన చీకటిలో వెలుగురేఖలా ఉంది. అల్జీమర్స్ ను చాలావరకు తగ్గించడానికి ఇది నివారణలా ఉపయోగపడొచ్చు. పైగా ఇది చేయడం కూడా చాలా సులభమే.’’ అన్నారు.