ఇప్పుడు వీఆర్ఏల సంగతేంటి ?
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేసీఆర్ నిర్ణయం. వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి అందరని ఆశ్చర్య పరిచారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల సంఖ్య 7300, వీఆర్ఏల సంఖ్య 24వేలు. విధుల్లో మాత్రం 4,800 మంది వీఆర్వోలు, 21 వేల మంది వీఆర్ఏలు ఉన్నారు. ఈ రెండు శ్రేణులను ఇతర శాఖల్లో విలీనం చేస్తారా? వీఆర్ఏలను అలాగే కొనసాగిస్తారా? అన్నది తేలాలి. వీఆర్వోలను ఏయే శాఖల్లో విలీనం చేస్తారో అంతు చిక్కడం లేదు. ఎందులో విలీనం చేసినా సర్వీసు అంశాల్లో సమస్యలు తప్పవని ఉద్యోగులు వాపోతున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల వీఆర్వో సంఘాలు మౌనం పాటిస్తున్నాయి. దీనిని వ్యతిరేకించి సాధించేదేం లేదని ఓ సంఘం ప్రధాన నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పని చేయించుకున్న ఆర్ఐలు, తహశీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయ లేదని పేర్కొన్నారు. వారి సంఘాల ప్రతినిధులు కూడా పని ఒత్తిడి గురించి ఎలాంటి ప్రస్తావన చేయడం లేదని వాపోయారు. ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దలు ఎక్కడ ఇబ్బందులకు గురి చేస్తారోనన్న భయం వారిలో కనిపిస్తోంది. రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తూ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు.