అందుకే ఆమె మాట మార్చిందా
139 మంది అత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తనపై ప్రముఖులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా వాటి వెనుక డాలర్ బాయ్ ఒత్తిడి ఉందని మీడియాకు తెలిపారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో బాధితురాలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘డాలర్ బాయ్ ఒత్తిడి మేరకే కొందరి పేర్లు పెట్టాల్సి వచ్చింది. కొంత మందితో నాకు ఎలాంటి సంబంధం లేదని నేను ఎంత చెప్పినా వినకుండా అనవసరంగా పేర్లు పెట్టించాడు. నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించాడు. చిత్ర హింసలకు గురి చేశాడు. యాంకర్ ప్రదీప్, కృష్ణుడికి ఈ కేసుతో సంబంధంలేదు. నాపై లైంగికదాడి జరిగింది వాస్తవమే. కానీ, సెలబ్రిటీలు లేరు. నేను బయట 50 శాతం వేధింపులకు గురైతే, 50 శాతం డాలర్ బాయ్ వేధించాడు. అనవసరంగా నా వల్ల ఇబ్బంది పడ్డవారికి క్షమాపణలు చెబుతున్నా. నాలా మరో అమ్మాయికి అన్యాయం జరగొద్దు. డాలర్ బాయ్ నాలా మరో ఇద్దరిని కూడా ట్రాప్ చేశాడు’అని బాధితురాలు పేర్కొన్నారు. కాగా, కొన్ని కుల సంఘాలు, మహిళా సంఘాలు బాధితురాలికి మద్దతు ప్రకటించాయి. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశాయి. మంద కృష్ణ మాదిగ, పీవోడబ్ల్యూ సంధ్య తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.