రాష్ట్ర మంత్రులు…తప్పుడు లెక్కలు : రాజశేఖర్‌రెడ్డి
బాధ్యత గల రాష్ట్ర మంత్రులు తప్పుడు లెక్కలు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు తెజస యువ నాయకులు రాజశేఖర్‌రెడ్డి. ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చామని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘనత సాధించలేదని బీరాలు పోతున్న తెరాస ప్రభుత్వంలోని మంత్రులు తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్, మరో మంత్రి జగదీష్‌రెడ్డి రాష్ట్రంలో నల్లా కలెక్షన్ల విషయంలో చెరో లెక్క చూపిస్తున్నారని అన్నారు. కేటీఆర్ తన ఫేస్‌బుక్‌లో 54.34 లక్షల ఇండ్లకు 53.46 , జగదీష్ రెడ్డి 98.31 నల్లా కనెక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చామని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం 83.04 ఇళ్లు ఉన్నట్లు పొందుపరిచారు. అయితే ఇందులో ఏదీ నిజం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజల మదిలో ఒక మిలయన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అసలు రాష్ట్ర మంత్రుల దగ్గరే సరైన సమాచారం లేకపోతే పాలన ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. గతంలో మిషన్ భగీరథలో వేల కోట్ల అక్రమాలు జరిగాయని దీనికి మంత్రి కేటీఆర్‌కి సంబంధం ఉందని ప్రచారం జరిగింది. ఇప్పుడా లెక్కలు చూస్తుంటే… అనుమానం వస్తుందని వ్యాఖ్యానించారు. ఇలా ప్రజలను మభ్యపెట్టి గొప్పలు చెప్పుకుంటే నిజం దాగదని అన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో, ఎన్ని నల్లా కనెక్షన్లు ఇచ్చారో…. స్వయంగా ముఖ్యమంత్రి శ్వేత ప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.