ఎరువులు తెచ్చి పెట్టుకొండి : సీఎం కేసీఆర్
రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగిన నేపథ్యంలో ఎరువుల డిమాండ్ కూడా పెరిగిందని, దీనికి తగినట్లు ఎరువులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై సిఎం సోమవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి తో చర్చించారు. ‘‘ఈ వర్షాకాలంలో తెలంగాణలో కోటి 40 లక్షల వరకు ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఎరువుల వాడకం కూడా పెరుగుతున్నది. గత ఏడాది ఆగస్టు 14 నాటికి రాష్ట్రంలో 8,06,467 టన్నుల ఎరువులు వినియోగమయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 14 నాటికి 15,88,788 టన్నుల ఎరువులను రైతులు తీసుకున్నారు. గత ఏడాది వర్షాకాలం సీజన్ లో మొత్తం 14.48 లక్షల టన్నుల ఎరువులు వినియోగం అయ్యాయి. ఈ ఏడాది 22.30 లక్షల టన్నులు వినియోగం అవుతాయని అంచనా. ఈ డిమాండుకు తగినట్లుగా ఎరువులను సిద్ధం చేయాలి. వర్షాలు, కరోనా, ఇతరత్రా సమస్యల కారణంగా ఎరువులు సకాలంలో అందడం లేదు. కాబట్టి తెలంగాణలోని పరిస్థితిని వివరించి, రాష్ట్రానికి ఎక్కువ ఎరువులు కేటాయించాలని, కేటాయించిన ఎరువులను త్వరగా రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి. వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి’’ అని సిఎం ఆదేశించారు.
సిఎం ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళుతున్నారు. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి, అధికారులతో చర్చిస్తారు.