కరోనాతో భారత క్రికెట్ మాజీ ఓపెనర్ మృతి

భారత మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన లక్నోలోని సంజయ్‌ గాంధీ పీజీఐ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ అతని ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా మరింత క్షీణించింది. దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతకు తరలించారు. చికిత్స సమయంలోనే ఆయనకు బీపీతో పాటు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తాయి. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆయన చికిత్స పొందుతున్నారు. గతనెలలో కరోనా బారినపడిన మాజీ ఓపెనర్‌ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఆయన శరీరంలోని చాలా అవయవాలు ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో చౌహాన్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. భారత్‌ తరఫున 40 టెస్టులు ఆడిన చౌహాన్‌.. సునీల్‌ గవాస్కర్‌తో కలసి ఓపెనర్‌గా బరిలో దిగారు. అలాగే ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో పలు హోదాల్లో పనిచేశారు.