మేడ్చల్‌‌‌‌, రంగారెడ్డి జిల్లాల్లో డేజంర్‌

గ్రేటర్ శివారు మేడ్చల్‌‌‌‌, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా డేంజర్‌‌‌‌ బెల్స్‌‌‌‌ మోగిస్తోంది. రెవెన్యూ పరంగా వేరే జిల్లాలే ఆయా జిల్లాల్లోని కొన్ని ఏరియాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కోర్ సిటీకి ఆనుకుని10కిలోమీటర్ల పరిధిలోనే పాజిటివ్‌‌‌‌లు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడిపై అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో ఆ రెండు జిల్లాలు కరోనాకు హాట్ స్పాట్లుగా మారుతున్నాయి. మొదట్లో బల్దియాకే పరిమితమైన కేసులు ఆన్ లాక్ తర్వాత ఒక్కసారి పెరిగాయి. వ్యాపార, ఆర్థిక లావాదేవీలతో గ్రేటర్ కోర్ సిటీతో ఆయా జిల్లాల్లోని ప్రాంతాలకు ఉన్న కమ్యూనికేషన్‌‌‌‌ కారణంగానే కేసులు అధికంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. నియంత్రణ, నిర్వహణ వ్యవహారాలన్నీ జీహెచ్ఎంసీనే చూస్తుండడంతో వైరస్‌‌‌‌ వ్యాప్తిపై పర్యవేక్షణ లేకపోవడం మరో కారణమని అధికారులు చెప్తున్నారు. పాలనా పరంగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు వేరే అయినా కొన్ని ఏరియాలు గ్రేటర్ పరిధిలో కలిసి ఉంటాయి. ఇప్పటివరకు మేడ్చల్‌‌‌‌ జిల్లాలో 2,301 నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే అల్వాల్, ఉప్పల్, చింతల్, బాలానగర్, కూకట్ పల్లి, సనత్ నగర్, బాచుపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి, కాప్రా వంటి ప్రాంతాల నుంచే 1,813 కేసులు వచ్చాయి. ఈ ప్రాంతాల నుంచే మరణించిన వారు కూడా ఎక్కువగా ఉన్నారు. మిగతా జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 685 పాజిటివ్‌‌‌‌లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 2,307 కేసులు నమోదైతే, బల్దియా పరిధిలోకి వచ్చే వనస్థలిపురం, సరూర్ నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ఏరియాల్లోని మణికొండ, రాయదుర్గం, ఎల్‌‌‌‌బీనగర్‌‌‌‌, రామచంద్రాపురం, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ప్రాంతాలతో పాటు క్వారంటెయిన్‌‌‌‌ హోటల్స్‌‌‌‌ అన్ని రాజేంద్రనగర్, శేరిలింగం పల్లి ఏరియాల్లోనే ఉండడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక కొత్త పేట ప్రూట్ మార్కెట్, వనస్థలిపురం, ప్రధాన మండీలన్నీ కోర్ సిటీకి సమీపంలోనే ఉండడంతో వైరస్‌‌‌‌ తీవ్రత ఎక్కువగానే ఉంది.