మోడీ అందుకే గాల్వన్ వెళ్లారా?
చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆకస్మికంగా లఢఖ్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా గత నెల 15న తూర్పు లఢఖ్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో గాయపడిన వీర జవాన్లను కలిశారు. లేహ్‌లోని ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఒక్కో సైనికుడి దగ్గరకు వెళ్లి.. మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం అండగా ఉందన్న భరోసా నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు ప్రధాని మోడీ. భారత్ ఎప్పుడూ ప్రపంచంలోని ఏ శక్తికీ తలవంచదని, 130 కోట్ల మంది ప్రజల తరఫున మీరు ధైర్య సాహసాలతో శత్రువుకు గుణపాఠం నేర్పారని కీర్తించారు. యావత్ ప్రపంచానికి భారత వీరత్వాన్ని చాటారని అన్నారు. శత్రువును మీరు ఎదుర్కొన్న తీరు గురించి ప్రపంచమంతా తెలుసుకుంది. ఇప్పుడు ఈ వీరులెవరన్న విషయం తెలుసుకోవాలనుకుంటోంది. మీ శిక్షణ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తోంది. మీ త్యాగాల గురించి, వీరత్వం గురించి ప్రపంచం చర్చించుకుంటోంది అని చెప్పారు మోడీ.











