రైతుబంధు రాక‌పోతే మండ‌లంలో ఆ సార్‌ని క‌ల‌వండి

రైతుబంధు నగదు జమకాని రైతులు ఈ నెల 5వ తేదీలోగా ఏఈఓలను కలిసి బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. 2020 వానాకాలానికి సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీపై ఆయన మాట్లాడుతూ… ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులు ఏఈఓలను కలవాలన్నారు. ఏఈఓలను కలిసి వారి వద్ద వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ వద్ద 34,860 మంది రైతుల ఖాతాల వివరాలు సరిగా లేవన్నారు. ఆ ఖాతాలకు మాత్రమే సొమ్ము చేరలేదన్నారు. ఆ రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసినా నగదు జమ కాలేదన్నారు. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ సరిగా లేక, ఖాతాలు మూసేయడం వల్ల నగదు జమ కాలేదన్నారు. 3,400 మంది రైతులకు బ్యాంకు పాసు పుస్తకాల్లో తేడాలు ఉన్నాయన్నారు. ఆధార్‌, పట్టాదారు పుస్తకాల్లోని ఖాతాదారుల పేర్లలో వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. అర్హత ఉన్నా నిధులు జమ కానైట్లెతే ఏఓ, ఏడీ, డీఏఓలను సంప్రదించాలని పేర్కొన్నారు.